Weather Update: కుండపోత వర్షాలు.. దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక

Published : Nov 16, 2026, 08:55 AM IST

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్వాన్ తుపానుగా మారుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

PREV
15
బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్ తుపాను

బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వేగంగా బలపడి అక్వాన్ తుపానుగా రూపాంతరం చెందుతోంది. ఇరాన్ దేశం ఈ తుపానుకు అక్వాన్ అని పేరు పెట్టింది. పర్షియన్ భాషలో దీనికి రాక్షస శక్తి అని అర్థం. ప్రస్తుతం ఇది విశాఖపట్నం, చెన్నై, శ్రీలంక తీరాలకు దూరంగా పయనిస్తూ, రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చేందుకు సిద్ధమవుతోంది.

25
ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న ప్రచండ తుపాను

ఈ తుపాను క్రమంగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. నవంబర్ 17 నాటికి తీవ్ర తుపానుగా, ఆ తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో సముద్రంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

35
కోస్తాంధ్రకు కుండపోత వర్షాల ముప్పు

తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో నవంబర్ 18 నుంచి వర్షాలు ప్రారంభమై, 19, 20 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాయలసీమ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

45
తెలంగాణలోనూ దంచికొట్టనున్న వానలు

ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తుపాను సమీపించిన తర్వాత, దాని ప్రభావం తెలంగాణపై కూడా గట్టిగానే పడనుంది. నవంబర్ 20, 21 తేదీల్లో తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది.

55
మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి

సముద్రం పూర్తిగా అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని, వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. అలాగే కోత దశకు వచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అందించే సూచనలను పాటించాలని కోరారు.

Read more Photos on
click me!

Recommended Stories