Hyderabad PRTS: హైదరాబాద్‌లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్) రాబోతోంది. డిసెంబర్‌లోగా టెండర్లు పూర్తి చేసి, ఏడాదిలోగా మొదటి దశను అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అసలు ఏంటి ఈ పీఆర్టీఎస్? వివరాలు మీకోసం.
ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతున్న హైటెక్ పాడ్ ట్యాక్సీలు
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టెండర్లు పూర్తయిన ఏడాదిలోగా మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.
25
అసలేంటి ఈ పీఆర్టీఎస్ సిస్టమ్?
పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఒక ఆటోమేటెడ్ పాడ్ ట్యాక్సీ వ్యవస్థ. ఇందులో చిన్నపాటి ఆటోమేటెడ్ పాడ్స్ ప్రత్యేకంగా నిర్మించిన గైడ్వేలపై ప్రయాణిస్తాయి. ఇవి సాధారణ బస్సుల్లా ప్రతిచోటా ఆగకుండా, తక్కువ స్టాపులతో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు నేరుగా తీసుకెళ్తాయి. మెట్రో స్టేషన్ దిగిన తర్వాత ఆఫీసులకు వెళ్లే లాస్ట్ మైల్ కనెక్టివిటీని ఇది ఎంతో సులభతరం చేస్తుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఇది పెద్ద ఊరటనిస్తుంది.
35
ఏడాదిలోగా సిద్ధం కానున్న మొదటి కారిడార్
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో విపరీతమైన ట్రాఫిక్ ఉండే మార్గంలో వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మొదటి ప్రాధాన్యం కింద కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు పీఆర్టీఎస్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఈ మార్గం దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్ మీదుగా వెళ్తుంది. దీని పనులను తక్షణమే మొదలుపెట్టాలని సీఎం సూచించారు.
హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య ప్రాంతాలు, పబ్లిక్ ప్రదేశాలను కలుపుతూ మరో రెండు కారిడార్లను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.
• ఒక కారిడార్ ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా రాణిగంజ్ బస్ స్టేషన్‌ను కలుపుతుంది.
• మరో కారిడార్ అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి రవీంద్ర భారతి, తెలంగాణ సెక్రటేరియట్, ఐమ్యాక్స్ మీదుగా బేగంపేట వరకు విస్తరించనుంది. మొత్తం నాలుగు కారిడార్ల ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
55
మల్టీ లెవల్ పార్కింగ్, డిపోల ఏర్పాటు
ప్రతి కారిడార్‌కు ఒక ప్రత్యేక డిపో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాహనదారులు తమ సొంత వాహనాలను ఒకచోట పార్క్ చేసి, అక్కడి నుంచి పాడ్స్‌లో ప్రయాణించే వీలు కల్పిస్తున్నారు. ఇందుకోసం గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో పీఆర్టీఎస్ డిపోతో కూడిన మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
అలాగే అసెంబ్లీ-బేగంపేట మార్గం కోసం నెక్లెస్ రోడ్ వెంబడి పీఆర్టీఎస్ డిపోతో కూడిన మరో మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాన్ని నిర్మించాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్ (CURE) లో ప్రయాణ సమయాన్ని తగ్గించడం, రోడ్లపై భారాన్ని తగ్గించి వాహన కాలుష్యాన్ని అరికట్టడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.