ఏటూరునాగారం శివారులో రాత్రిపూట ఈ అరుదైన పాము రోడ్డు దాటుతుండగా కొందరు ప్రయాణికుల కంటపడింది. మొదట ఈ నలుపు-పసుపు చారల వింత పామును చూసి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తర్వాత కాస్త దైర్యం తెచ్చుకుని ఈ పామును ఫోటోలు, వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఇది చాలా అరుదైన పాము అని తెలిసింది.
గతంలో వరంగల్‌లోని పాకాల అడవుల్లో, ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివార్లలో కూడా ఇలాంటి పామే కనిపించింది. అశోక్ నగర్‌లో పొలం పనులకు వెళ్లిన రైతులు దీన్ని మొదటిసారి చూసి, ఏదో ప్లాస్టిక్ బొమ్మ అనుకున్నారు. కానీ అది కదలడం మొదలుపెట్టగానే భయంతో వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
5 అడుగుల పొడవున్న ప్రాణాంతక సర్పం
సమాచారం అందుకున్న వెంటనే అటవీ అధికారులు, స్నేక్ రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సుమారు 5 అడుగుల పొడవున్న ఈ పామును చాలా చాకచక్యంగా పట్టుకుని, దట్టమైన అడవిలో సురక్షితంగా వదిలిపెట్టారు.
పాముల నిపుణుల ప్రకారం.. ఈ పాము విషం 100 శాతం ప్రాణాంతకమైన న్యూరోటాక్సిన్‌ను కలిగి ఉంటుంది. ఇది కాటు వేసిన కొద్ది నిమిషాల్లోనే విషం నాడీ మండలంపై దాడి చేస్తుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి మనిషి చనిపోతాడు.
చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించినా, అంతే ప్రమాదకరమైన విషాన్ని ఇది కలిగి ఉంటుంది. ఇది నిశాచర జీవి.. అంటే పగటిపూట కాకుండా రాత్రిపూట చాలా చురుకుగా ఉండే పాము అన్నమాట. సాధారణంగా ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది… కానీ దానికి ఇబ్బంది కలిగిస్తే మాత్రం వెంటనే దాడి చేస్తుంది.