
Andes Sri : ''జయజయహే తెలంగాణ జననీ జయ కేతనం... ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం''... ఈ పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేస్తూనే ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని నింపిన గీతమిది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర గీతం కూడా ఇదే. ఇలాంటి అద్భుతమైన గీతాన్ని రచించిన ప్రముఖ కవి అందెశ్రీ ఇవాళ (నవంబర్ 10, సోమవారం) ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన అకాల మరణం తెలంగాణ సమాజానికే కాదు సాహితీ లోకానికి తీరని లోటు. సహజ కవిగా గుర్తింపుపొందిన అందేశ్రీ జీవన ప్రస్థానం గురించి తెలుసుకుందాం.
అందెశ్రీ అసలుపేరు అందె ఎల్లయ్య. ఆయన స్వస్థలం జనగాం జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామం. అతి సామాన్య కుటుంబంలో 1961 జూలై 18న జన్మించారు. ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో అనాధగా మారిపోయారు. కనీస విద్యాభ్యాసానికి కూడా నోచుకోని ఎల్లయ్య జీవితంలో ఎన్నో కష్టాలు... కానీ అన్నింటిని దాటుకుని తెలంగాణ సమాజమే గర్విచేస్థాయి కవిగా మారారు... ఎల్లయ్య కాస్త అందేశ్రీగా గుర్తింపుపొందారు.
తోటి పిల్లలతో హాయిగా ఆడుకోవాల్సిన వయసులో పశువుల (గొర్ల) కాపరిగా పనిచేశారు అందెశ్రీ. ఈ సమయంలోనే ఆయన ఏమాత్రం నిరాశ చెందకుండా ఏదో నేర్చుకోడానికి ప్రయత్నించేవారు… ఇలా పల్లెటూరి సాహిత్యంపై పట్టు సాధించారు. ఎలాంటి చదువు లేకపోయిన అతడు సొంతంగా పాటలను కట్టేవారు... ఇవి అక్కడి ప్రజలను ఎంతగానో ఆకట్టుకునేవి. దీంతో రేబర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి జానపద గాయకుడిగా గుర్తింపుపొందారు.
అయితే ఆయన జీవితాన్ని ఈ పాటలే మార్చేశాయి. శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహరాజ్ ఓసారి అందెశ్రీ పాటలు విని పరవశించి పోయారు... దీంతో అనాధగా ఉన్న అతడిని చేరదీశారు. ఇలా పశువుల కాపరి నుండి సాహితీవేత్తంగా అందెశ్రీ జీవితం మలుపు తిరిగింది.
ఎలాంటి చదువు లేకపోయినా అందేశ్రీ రచయితగా గుర్తింపు పొందారు. తెలంగాణ సాహిత్యంపై మంచి పట్టున్న ఆయన స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో తన పాటనే ఆయుధంగా మార్చారు. 'జయజయహే తెలంగాణ జననీ జయ కేతనం' అంటూ సాగే గీతం ఉద్యమకారులను ఉర్రూతలూగించేది... ఇది తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగపడటమే కాదు అందెశ్రీకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
కేవలం జానపద సాహిత్యమే కాదు సినిమాలకు కూడా పాటలు, మాటలు రాశారు అందెశ్రీ,. ముఖ్యంగా విప్లవ సినిమాలను రూపొందించే నారయణమూర్తికి ఎక్కువగా పాటలు రాసేవారు. 2006 లో గంగ సినిమాకు గాను నంది పురస్కారాన్ని పొందారు. బతుకమ్మ సినిమాకు మాటలు కూడా రాశారు. ఇలా కలం పట్టకుండానే కవి, రచయితగా మారారు అందెశ్రీ.
సాహితీవేత్తగా ఎంతో ఎత్తుకు ఎదిగిన అందెశ్రీకి అనేక అవార్డులు లభించాయి. కాకతీయ యూనివర్సిటీ అతడికి గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది... దీంతో ఎలాంటి చదువు లేకుండానే డాక్టర్ గా మారిపోయారు. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ కూడా అందుకున్నారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో సుద్దాల హన్మంతు- జానకమ్మ జాతీయ పురస్కారం, 2024 లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్… ఇలాా అనేక్ పురస్కారాలు అందెశ్రీ అందుకున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన రచించిన సినిమా పాట 'మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు' ఆంధ్ర విశ్వవిద్యాలయం సిలబస్ లో చేర్చారు. ఇలా చదువన్నదే ఎరగని అందెశ్రీ సాహిత్యం ఓ యూనివర్సిటీలో పాటంగా మారింది.
అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈమేరకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని... ఏలోటు లేకుండా సజావుగా అంత్యక్రియలు జరిగేలా చూడాలని చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఇప్పటికే అందెశ్రీ పార్థివదేహాన్ని లాలాపేటలోని నివాసానికి తరలించారు. రేపు (మంగళవారం) ఘట్ కేసర్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు అందెశ్రీ మరణంపై సంతాపం ప్రకటించారు... కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. ఇక సాహితీవేత్తలు అందెశ్రీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.