ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. పోలింగ్ కు రంగం సిద్ధం

Published : Nov 09, 2025, 08:22 PM IST

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంది.

PREV
15
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎల్లుండి పోలింగ్

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల హోరాహోరీ ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. గత కొన్ని వారాలుగా మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీ మధ్య తీవ్ర పోటీ సాగింది. నవంబర్‌ 11న ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్‌ 14న ఉంటుంది. ఈ ఉపఎన్నికలు మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి నిర్వహిస్తున్నారు.

25
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ముఖ్య పార్టీల త్రిముఖ పోరు

ఈ ఎన్నికలో బీఆర్ఎస్‌ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్‌ నుంచి నవీన్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా దీపక్‌ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తంగా 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల మధ్యే ఉంది. అధికార కాంగ్రెస్‌ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా మూడు విడతల్లో ఆరు రోజులపాటు నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మరోవైపు బీఆర్ఎస్‌ కూడా గెలుపు సాధించి రేవంత్‌ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తిని చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ సైతం ఈ సారి గెలుపు కోసం పూర్తి శక్తినీ వినియోగిస్తోంది.

35
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు సిద్ధం.. కఠిన భద్రతా చర్యలు

జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ పోలింగ్ ఏర్పాట్ల గురించి వివరించారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసీ 407 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 139 సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. 

మొత్తం 2,060 మంది పోలింగ్‌ సిబ్బంది విధుల్లో ఉంటారు. అదనంగా 45 FST, 45 SST బృందాలు నియమించారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల కోసం 8 కంపెనీల CISF, 1,761 మంది లోకల్‌ పోలీసులు బందోబస్తులో ఉంటారు.

45
మద్యం విక్రయాలపై ఆంక్షలు.. 144 సెక్షన్ అమలు

ఎన్నికల నియమావళి ప్రకారం జూబ్లీహిల్స్‌ పరిధిలో నవంబర్‌ 11 సాయంత్రం వరకు అన్ని వైన్‌ షాపులు మూసివేయనున్నారు. స్థానికేతరులు సాయంత్రం 6 గంటల తర్వాత నియోజకవర్గంలో ఉండరాదని అధికారులు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుంపులుగా తిరగడంపై నిషేధం విధించారు. ఓట్ల లెక్కింపు రోజు అంటే నవంబర్‌ 14న బాణాసంచా పేల్చడం పై కూడా నిషేధం విధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

55
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బోరబండ, రెహ్మత్‌నగర్‌ డివిజన్ల ఓటింగ్‌ ఫలితాలు ఈ ఎన్నికల గెలుపును నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుమారు 1.10 లక్షల ఓట్లు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఉపఎన్నిక ఫలితం కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాదరణకు, బీఆర్‌ఎస్‌ పునరాగమనానికి, బీజేపీ ఉనికి పెరుగుదలకు సూచనగా ఉండొచ్చు.

ప్రచారం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పోలింగ్‌ రోజుపైనే ఉంది. ప్రతి పార్టీ కార్యకర్తలు ఓటర్లను కేంద్రాలకు తరలించే ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. నవంబర్‌ 11న ఓటింగ్‌ పూర్తయ్యాక, నవంబర్‌ 14న ఫలితాలు వెల్లడి అవుతాయి. దీంతో ఎవరు జూబ్లీహిల్స్‌ గద్దెను అధిరోహిస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మక పోరుగా మారాయి. ఎందుకంటే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ.. ఈ మూడు పార్టీల భవిష్యత్తు ప్రయాణం ఈ ఫలితాలపై ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.

Read more Photos on
click me!

Recommended Stories