తోటి ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు, ఆపై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఉద‌య్ కృష్ణారెడ్డి కేసులో షాకింగ్ ట్విస్టులు

Published : Jul 28, 2026, 10:13 PM IST

Trainee IPS Uday Krishna Reddy: సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తోటి మ‌హిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైగింక వేధింపుల‌తో మొద‌లైన వ్య‌వ‌హారంలో కీల‌క అప్డేట్ వ‌చ్చింది.

PREV
14
అసలు కేసు ఏంటి? ఎలాంటి ఆరోపణలు వచ్చాయి?

నేషనల్ పోలీస్ అకాడమీలో (NPA) శిక్షణ పొందుతున్న కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి.. ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను పదేపదే లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యకర సందేశాలు పంపాడని ఆరోపించారు. అంతేకాకుండా, ఒక సందర్భంలో గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి జుట్టు పట్టుకుని దాడి చేశాడని, గొంతు నులిమి, కత్తితో బెదిరించాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎన్‌పీఏ చర్యలు.. తాత్కాలిక సస్పెన్షన్

ఫిర్యాదు వెలుగులోకి వచ్చిన తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీ అంతర్గతంగా విచారణ చేపట్టింది. ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి నిర్దిష్ట గడువులోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో పోలీసు దర్యాప్తు కూడా కొనసాగింది.

24
ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రిలో చికిత్స

ఈ పరిణామాల తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి తన స్వగ్రామానికి వెళ్లినట్లు సమాచారం. అనంతరం హైదరాబాద్‌లోని స్నేహితుడి ఇంటికి వచ్చిన ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడైంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికి ఆయన స్పృహలో లేరని వైద్యులు తెలిపారు. అత్యవసరంగా స్టమక్ వాష్ నిర్వహించి చికిత్స అందించారు.

వైద్యుల వివరాల ప్రకారం, ఆయన అధికంగా ఆల్కహాల్ సేవించినట్లు సమాచారం అందిందని చెప్పారు. ఘటనాస్థలంలో శానిటైజర్‌తో పాటు ఆల్కహాల్ బాటిల్ లభించినప్పటికీ, ఆయన ఏ పదార్థాన్ని సేవించారనే విషయం స్పష్టంగా నిర్ధారణ కాలేదని వెల్లడించారు. కొంతకాలం ఆయన పరిస్థితి విషమంగా ఉండగా, అనంతరం చికిత్సకు స్పందించినట్లు వైద్య బృందం తెలిపింది.

34
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. గాలింపు తర్వాత అరెస్ట్

చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి కొంతకాలం అందుబాటులో లేకపోవడంతో పోలీసులు గాలింపు ప్రారంభించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఆయన కోసం వెతికాయి. చివరకు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అనంతరం అధికారికంగా అరెస్ట్ చేశారు. తర్వాత విచారణ కోసం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తును నగర పోలీసు కమిషనర్ మహిళల భద్రత విభాగానికి (Women's Safety Wing) బదిలీ చేయడంతో, ప్రత్యేక బృందం దర్యాప్తును కొనసాగిస్తోంది.

44
క్వాష్ పిటిషన్.. ఉదయ్ స్పందన..

తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనున్న సమయంలోనే అరెస్ట్ కావడం ఈ కేసులో మరో కీలక పరిణామంగా మారింది. మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను ఉదయ్ పూర్తిగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై నమోదైన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా స్వగ్రామానికి వెళ్లినట్లు తెలిపారు. 

న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. తన శాశ్వత చిరునామాకు ఎలాంటి నోటీసులు అందలేదని కూడా ఆయన వెల్లడించారు. ఇక ఈ కేసుపై స్పందించిన రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్.. చట్టపరమైన నిబంధనల ప్రకారమే దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేసులోని ఆరోపణలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, వర్తించే చట్టపరమైన సెక్షన్ల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో పోలీసు దర్యాప్తుతో పాటు న్యాయపరమైన ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories