Hill Stations Near Hyderabad
Hill Stations Near Hyderabad : ప్రతి ఒక్కరికీ ఈ బిజీ లైఫ్ లో కాస్త విశ్రాంతి అవసరం. మరీముఖ్యంగా హైదరాబాద్ వంటి కాంక్రీట్ జంగిల్ లో జీవించేవారికి అప్పుడప్పుడు ప్రకృతి ఒడిలో సేదతీరడం చాలా అవసరం. ప్రస్తుతం స్కూళ్లు, కార్యాలయాలకు వరుస సెలవులున్నాయి కాబట్టి టూర్ ప్లాన్ చేసుకునేందుకు ఇదే మంచి సమయం. ఎండల వేడినుండి తప్పించుకునేందుకు పచ్చని అడవులు, కొండకోనల్లో సేదతీరవచ్చు. ఇలా హైదరాబాద్ నుండి చాలా సులువుగా వెళ్లిరాగల హిల్ స్టేషన్స్ కొన్ని ఉన్నాయి. ఖర్చు కూడా చాలా తక్కువే. ఇలాంటి హిల్ స్టేషన్స్ గురించి తెలుసుకుందాం.
Nallamala
నల్లమల కొండలు :
హైదరాబాద్ నుండి రెండుమూడు గంటల ప్రయాణ దూరంలో ఉంటుంది నల్లమల ఫారెస్ట్. ఎత్తైన కొండలు, దట్టమైన అడవితో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ అడవి. ప్రస్తుతం ఈ నల్లమల అడవిలోని లోయలో వెలిసిన సలేశ్వరం లింగమయ్య జాతర జరుగుతోంది. అంతెత్తు నుండి కిందకు జాలువారే జలపాతాన్ని చూస్తూ లోయలో ట్రెక్కింగ్ అద్భుత అనుభూతిని ఇస్తుంది.
ఏడాదిలో కేవలం మూడురోజులు మాత్రమే సలేశ్వరం లింగమయ్య ఆలయానికి భక్తులను అనుమతిస్తారు. ఏప్రిల్ 11 నుండి జాతర ప్రారంభమయ్యింది... ఏప్రిల్ 13తో అంటే ఇవాళ్టితో ఇది ముగుస్తుంది. వరుస సెలవుల నేపథ్యంలో నిన్నటినుండి ఈ జాతరకు భక్తుల పోటేత్తారు... దీంతో సలేశ్వరంకు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంకు 60 కిలోమీటర్ల దూరంలో ఈ సలేశ్వరం ఉంటుంది. దట్టమైన అడవిలో టైగర్ రిజర్వ్ లో కొంతదూరం వాహనం, మరికొంతదూరం కాలినడకన ప్రయాణం ఉంటుంది. 3 కిలోమీటర్లు కొండలు, గుట్టల నడుమ బండరాళ్లు, నీళ్ల మధ్య కాలినడకన ప్రయాణం ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి 130 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఇక సలేశ్వరం మాత్రమే కాదు ఈ నల్లమలలో అనేక సందర్శనీయ ప్రదేశాలున్నాయి. అడవిలో సహజ అందాలను ఆహ్వాదించడమే కాదు నాగార్జున సాగర్ లో బోటింగ్, ఘాట్ రోడ్డు ప్రయాణం, శ్రీశైలం ప్రాజెక్ట్ వ్యూ, అభయారణ్యం, ఉమామహేశ్వర ఆలయం ఉన్నాయి. నల్లమల కొండలపై ట్రెకింగ్ కూడా చేయవచ్చు. సహజ ప్రకృతి అందాలు గొప్ప అనుభూతిని అందిస్తాయి.
Anantagiri
అనంతగిరి కొండలు :
హైదరాబాద్ కు అతి సమీపంలో ఉంటాయి అనంతగిరి కొండలు. నగరానికి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ జిల్లాలో ఉంటాయి. అంటే హైదరాబాద్ నుండి ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగిరావచ్చమాట. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులతో ఆ వాతావరణం చాలా ఆహ్లాదరకంగా ఉంటుంది.
ఈ అనంతగిరి కొండలు ట్రెక్కింగ్ కు చాలా అనువుగా ఉంటాయి. కుటుంబంతో లేదంటే స్నేహితులు, సహోద్యోగులతో కలిసి అనంతగిరి టూర్ కు వెళ్లి తెగ ఎంజాయ్ చేయవచ్చు. ట్రెకింగ్ మాత్రమే కాదు రాక్ క్లైంబింగ్, నేచర్ వాక్, బోటింగ్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లో హిల్ స్టేషన్స్ :
కాస్త దూరమైన పరవాలేదు అనుకుంటే హైదరాబాద్ నుండి హాయిగా లంబసింగి వెళ్లిరావచ్చు. దీన్ని తెలుగోళ్ల కాశ్మీర్ గా పిలుచుకుంటారు... అంటే అంత ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. కొండలు కోనల నడుమ దట్టమైన అడవి, చల్లని వాతావరణం ఇక్కడికి వెళ్లేవారికి కట్టిపడేస్తుంది. అరకు కూడా ఇక్కడికి చాలా దగ్గర్లో ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లి ప్రాంతంలో ఉండే హార్సిలీ హిల్స్ అద్భుతమైన హిల్ స్టేషన్. ఇక్కడ ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్ చేయవచు. అందమైన అటవీ అందాల మధ్య కొండపైకి చేరుకోవడం అద్భుత అనుభూతిని ఇస్తుంది.