vanajeevi ramaiah
Vanajeevi Ramaiah : ప్రస్తుతం అభివృద్ధి పేరిట నగరాలు కాంక్రీట్ జంగల్ గా మారుతున్నాయి. తమ అవసరాల కోసం పచ్చని చెట్లను నరికేసి పెద్దపెద్ద భవంతులు నిర్మిస్తున్నారు. అందరూ చెట్లను నరికి ప్రకృతి నాశనం చేసేవారే... చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలనుకునేవారు చాలా తక్కువమంది. ఇలాంటివారిలో మన తెలంగాణ బిడ్డ వనజీవి రామయ్య ముందువరుసలో ఉంటారు. తన జీవితాంతం మొక్కలు నాటేందుకే దారపోసిన ప్రకృతి ప్రేమికుడు రామయ్య.
సమాజ హితం కోసం, భావితరాలను మంచి వాతావరణాన్ని అందించాలన్న సద్భావన కలిగిన గొప్పవ్యక్తి రామయ్య. ఒంట్లో సత్తువు ఉన్నంతవరకు మొక్కలు నాటుతూనే ఉన్నారు... జీవిత చరమాంకంలో ఆరోగ్యం సహకరించకున్నా వెనకడుగు వేయలేదు. ఒక్కడే కోటికి పైగా మొక్కలునాటి చరిత్ర సృష్టించాడు... తన ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్నాడు.
ఇలా ఇంతకాలం నిస్వార్థంగా ప్రకృతి సేవ చేసిన వనజీవి రామయ్య ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపుడతూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రామయ్య ఇవాళ (శనివారం) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 85 ఏళ్ల వయసులో రామయ్య ప్రాణాలు విడిచారు... ఇదితెలిసి ఆ ప్రకృతే కంటతడి పెడుతుందేమో.
vanajeevi ramaiah
రామయ్యను వనజీవిగా ఎలా మారారు?
తెలంగాణలోని ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో వ్యవసాయ కుంటుంబంలో 1937లో జన్మించారు దరిపల్లి రామయ్య. ఆయన పదో తరగతి వరకు చదువుకున్నారు. ఇలా చదువుకునే సమయంలోనే అతడిని మల్లేశం అనే ఉపాధ్యాయుడు చాలా ప్రభావితం చేసాడు. పర్యావరణాన్ని కాపాడేది చెట్లేనని... వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అంటూ మల్లేశం సార్ చెప్పిన మాటలు రామయ్య మనసులో నాటుకుపోయాయి. అప్పటినుండి చెట్లపై మక్కువ పెంచుకుని మొక్కలు నాటడం ప్రారంభించారు. ఇలా మొదలైన ఆయన మొక్కల పెంపకం చివరకు ఓ ఉద్యమంలా సాగింది.
ఓవైపు వ్యక్తిగత జీవితాన్ని, మరోవైపు తన మొక్కల పెంపకాన్ని బ్యాలన్స్ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించారు రామయ్య. భార్య జానకమ్మ, నలుగు బిడ్డలకు ఏలోటు రాకుండా చూసుకుంటూ ప్రకృతి ప్రేమను చాటుకున్నాడు. అతడికి చెట్లంటే ఎంత ఇష్టమంటే తన మనవరాళ్లకు కూడా మొక్కల పేర్లు పెట్టారు... హరిత లావణ్య, కబంధపుష్ఫ, చందన పుష్ప, వన శ్రీ అని.
మొదట్లో తన ఇంటిదగ్గర సొంతస్థలంలో మొక్కల పెంపకం ప్రారంభించారు రామయ్య. ఆ తర్వాత మెళ్ళిగా ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ భూములు, రోడ్లపక్కన చెట్లు పెంచేవాడు. ఎండాకాలంలో అడవుల నుండి విత్తనాలు సేకరించి వానాకాలంలో చల్లేవాడు. ఇలా అతడు తన జీవితంలో కోటికి పైగా మొక్కలు నాటాడు... అవిప్పుడు మానవాళికి ఆహ్లాదరకమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.
పేరుకోసమో, డబ్బుల కోసమే కాదు కేవలం ప్రకృతిని కాపాడాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో నిస్వార్థంగా మొక్కల పెంపకాన్ని సాగించారు రామయ్య. తాను పెంచడమే కాదు అందరూ మొక్కలు పెంచాలంటూ 'వృక్షో రక్షతి రక్షిత:' అనే బోర్డులు తలకు పెట్టుకుని, మెడలో వేసుకుని ప్రచారం చేసేవారు. స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఈ మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి వారినికూడా భాగస్వామ్యం చేసేవారు. ఇలా పర్యావరణాన్ని కాపాడేందుకు విశేషమైన కృషి చేశారు రామయ్య.
Vanajeevi Ramaiah
రామయ్యన వరించిన అవార్డులు :
రామయ్య ప్రకృతి సేవకు మెచ్చి అనేక అవార్డులు వచ్చాయి. దీంతో అతడి పేరు రాష్ట్ర స్ధాయిలోనే కాదు జాతీయ స్థాయిలో మారుమోగింది. మొదట్లో చెట్ల రామయ్య, మొక్కల రామయ్య కాస్త వనజీవిగా మారాడు... ఆ తర్వాత జాతీయస్థాయిలో ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపుపొందాడు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
2005లో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ వనమిత్ర అవార్డుతో సత్కరించింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 1995 లొ భారత ప్రభుత్వం వనసేవా అవార్డు అందించింది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు వనజీవి రామయ్య పర్యావరణాన్ని కాపాడేందుకు చేసిన కృషిని తెలియజేస్తూ 6వ తరగతి పాఠ్యాంశంలో చేర్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకు రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా బోధిస్తోంది.
ఇలా కేవలం ప్రకృతి సేవతో గొప్పపేరు తెచ్చుకున్న రామయ్య ఆ ప్రకృతి ఒడిలో చేరిపోయారు. ఆయన మరణవార్త తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంలు , భట్టి విక్రమార్క, పవన్ కల్యాణ్ లతో పాటు రాజకీయ ప్రముఖు సంతాపం తెలియజేసారు. ఆయన పర్యావరణాన్ని కాపాడేందుకు చేసిన కృషిని కొనియాడారు.