Published : Jun 30, 2025, 08:06 AM ISTUpdated : Jun 30, 2025, 08:51 AM IST
జూన్ లో ముఖం చాటేసిన వర్షాలు జూలైలో ఏం చేస్తాయోనని తెలుగు ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల చివరిరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో వాతావరణ శాఖ వెల్లడించింది.
Telugu States Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటున్నాయి. జూన్ నెలంతా వర్షాల కోసం ఎదురుచూసిన తెలుగు ప్రజలకు చివర్లో కాస్త ఊరట లభిస్తోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా ఇవి మరింత విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఈ మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
25
జూన్ 30 తెలంగాణలో వర్షాలు
రుతుపవనాలు ఇప్పటికే తెలంగాణ మొత్తం విస్తరించాయి. అలాగే బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో వర్షాలకు అనుకూలంగా అల్పపీడనాలు, ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
35
తెలంగాణ ప్రజలు జాగ్రత్త
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించారు. కాబట్టి వర్షం కురిసే సమయంలో ప్రజలు మరీముఖ్యంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవాళ(సోమవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్నిచోట్ల భారీ వర్షసూచనలు ఉన్నట్లు ప్రకటించారు. నిన్న(ఆదివారం) తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసాయి. హైదరాబాద్ లో కూడా చిరుజల్లులు పడ్డాయి. నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.
55
జూన్ 30 ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సోమవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఉదయం నుండే వర్షాలు మొదలవుతాయని... ఇవి రాత్రి వరకు కొనసాగుతాయని హెచ్చరించారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవొచ్చని... మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాలు కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.