Winter Cold Alert: వణికిస్తున్న చలి.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్.. 3 రోజులు జాగ్రత్త

Published : Nov 11, 2026, 09:28 AM IST

Winter Cold Alert: తెలంగాణలో అకస్మాత్తుగా పెరిగిన చలి తీవ్రతపై భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. 21 జిల్లాల్లో 14 డిగ్రీలకు పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతల క్రమంలో, రాబోయే మూడు రోజుల్లో మరింత తగ్గే అవకాశం వుందని తెలిపింది.

PREV
16
చలి పంజాకు వణికిపోతున్న జనం.. భారీగా తగ్గిన టెంపరేచర్

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటిదాకా ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు, ఇప్పుడు చలి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో 20 డిగ్రీలకు పైగా నమోదైన రాత్రి ఉష్ణోగ్రతలు, కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 15 డిగ్రీల దిగువకు చేరడం గమనార్హం.

26
21 జిల్లాల్లో 14 డిగ్రీలకే పడిపోయిన టెంపరేచర్లు

రాష్ట్రవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా 21 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల రేంజ్‌లోనే నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కుబీర్‌లో అత్యల్పంగా 14.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. అలాగే సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో 14.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. రంగారెడ్డి, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 14.8 డిగ్రీలుగా ఉంది.

36
హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత పెరుగుదల

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ చలి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. నగరంలోని నాగోల్, ఆదిబట్ల, రాజేంద్రనగర్, కీసర, ఫలక్‌నుమా, అమీన్‌పూర్ ప్రాంతాలతో పాటు వెస్ట్ మారేడ్‌పల్లి, శామీర్‌పేట శివార్లలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట ఎండ కాస్తున్నప్పటికీ, సాయంత్రం ఆరు గంటల నుంచి చల్లని ఈశాన్య గాలులు వీస్తున్నాయి.

46
రాబోయే మూడు రోజుల్లో మరింత తగ్గే అవకాశం

వాతావరణ శాఖ, టీజీడీపీఎస్ అంచనాల ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు ఏకంగా 11 నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆసిఫాబాద్, గద్వాల, వరంగల్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

56
పొగమంచు హెచ్చరికలు

తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల రహదారులపై విజిబిలిటీ తగ్గే ప్రమాదం ఉంది. ఉదయం వేళల్లో ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లేవారు, అలాగే హైవేలపై ప్రయాణించే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉదయం, రాత్రి సమయాల్లో బయటికి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

66
వాతావరణ మార్పులకు అసలు కారణం ఏమిటి?

ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న చల్లని గాలుల వల్లే రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత అది మరింత బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. పగటిపూట 31 నుంచి 32 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాత్రికి మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతుండటంతో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories