Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షాలు

Published : Nov 10, 2026, 08:13 AM IST

Weather Update: బంగాళాఖాతంలో నవంబర్ 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతోంది.

PREV
15
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు

తెలుగు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఇదే సమయంలో మరోసారి వర్షాలు కూడా పలకరించనున్నాయి. వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, నవంబర్ 13వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిణామం పట్ల వాతావరణ నిపుణులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం బలపడిన తర్వాత దాని కదలికలు, తీవ్రతను బట్టి వర్షాల ప్రభావంపై మరింత స్పష్టత రానుందని అధికారులు తెలిపారు.

25
తెలుగు రాష్ట్రాలపై వర్షాల ప్రభావం

ఈ అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు యానాం ప్రాంతంలోనూ వాతావరణం మారుతుంది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వర్షాల సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

35
పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిస్తున్న రాత్రి ఉష్ణోగ్రతలు

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావం వల్ల రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరం హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఉదయవేళల్లో ప్రజలు చలితో పాటు పొగమంచును కూడా ఎదుర్కొంటున్నారు.

45
ఏజెన్సీ ప్రాంతాల్లో పడిపోతున్న పాదరసం

రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్ వంటి పలు ప్రాంతాల్లో ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఇక ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా 14 నుంచి 16 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

55
నిపుణుల హెచ్చరికలు

వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవైపు చలి తీవ్రత, మరోవైపు పొగమంచు, ఆపై ఆకస్మిక వర్షాల హెచ్చరికలరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తదనుగుణంగా ప్రయాణాలు, దైనందిన కార్యక్రమాలు సాగించాలని సలహా ఇస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories