Published : Dec 05, 2025, 07:08 PM ISTUpdated : Dec 05, 2025, 07:15 PM IST
IMD Cold Wave : తెలంగాణలో మరోసారి అత్యల్ఫ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏఏ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుందో తెలుసా?
Weather Update : తెలుగు రాష్ట్రాలపై మరోసారి చలి పంజా విసరనుందని వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి... ఏపీలో కూడా వర్షాలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయట. ఇటీవల ఉష్ణోగ్రతలు 5-6 డిగ్రీ సెల్సియస్ కు పడిపోయి అత్యంత చలి కొనసాగిన విషయం తెలిసిందే... మళ్లీ అలాంటి పరిస్థితులే ఉండనున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ లాంటివారు హెచ్చరిస్తున్నారు.
25
ఈ పదిరోజులు బిఅలర్ట్
రాబోయే పదిరోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని... ప్రజలు చలిని తట్టుకునేందుకు సిద్దంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేటి (డిసెంబర్ 5, శుక్రవారం) నుండే చలి మొదలవనుందని... హైదరాబాద్ లో రేపటి (డిసెంబర్ 6, శనివారం) నుండి చలి మొదలవుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
35
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రారంభమే రాష్ట్రం మొత్తం వ్యాపిస్తుందని... మరోసారి గడ్డకట్టే చలి ఖాయమని ప్రకటించింది. దక్షిణ తెలంగాణ జిల్లాలు నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 11 నుండి 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
ఇక హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని... రాత్రి, తెల్లవారుజాము వేళల్లో విపరీతమైన పొగమంచు ఉంటుందట. ఉపరితల గాలులు తూర్పు దిశలో వీచే అవకాశాలున్నాయని... గాలివేగం గంటకు 4 నుండి 6 కి.మీ ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
55
ఆదిలాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఇదిలాఉంటే ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున ఆదిలాబాద్ లో అత్యల్పంగా 10.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే మెదక్ లో 14.3, హన్మకొండలో 14.5, రామగుండంలో 15.2, నల్గొండలో 17, నిజామాబాద్ లో 17.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 15.6, రాజేంద్రనగర్ లో 16, ఈక్రిశాట్ పటాన్ చెరులో 17.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.