వేసవి సెలవులపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ :
ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అడపాదడపా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతున్నాయి... దీంతో మధ్యలో ఎండలు తగ్గినా వడగాలుల వీస్తున్నాయి. ఇక మండుటెండల సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించిపోయాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.
ఇలా ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వేసవి సెలవులు ఈసారి ముందుగానే ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరిగింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని పరీక్షలు తొందరగా ముగించి ముందుగానే సెలవులు ఇస్తారన్నది ప్రచారం. ప్రతిసారిలా ఏప్రిల్ 24 నుండి కాకుండా ఏప్రిల్ 20 నుండే వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని జోరుగా ప్రచారం జరిగింది.
ఈ ప్రచారం నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజన్ మొదలయ్యింది. పరీక్షల షెడ్యూల్ ఏమయినా మారుతుందా? అన్న అనుమానం మొదలయ్యింది. ఇలా గందరగోళం నెలకొనడంతో పరీక్షలు, వేసవి సెలవులపై విద్యాశాఖ క్లారిటీ ఇవ్వక తప్పలేదు. ప్రస్తుతం జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని... వేసవి సెలవులు ఎప్పట్లాగే ఏప్రిల్ 24న ప్రారంభం అవుతాయని ప్రకటించారు. కాబట్టి వేసవి సెలవులపై ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది.