ఇప్పటి వరకు వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) లేకున్నా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. 2019 ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ నిబంధన అమల్లో ఉండేది అయితా తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2019 ఏప్రిల్ ఒకటికి ముందు తయారైన వాహనాలకు కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
టూ వీలర్, ఫోర్ వీలర్, త్రీ వీలర్ ఇలా అన్ని వాహనాలకు ఇకపై హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఉండాల్సిందేనన్నమాట. నిజానికి ఇది వరకే సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. మరీ ముఖ్యంగా 2019కి ముందు వాహనాలకు ఈ నంబర్ ప్లేట్లు లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
చివరి తేదీ ఎప్పుడంటే.?
అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చుకోవడానికి 2025 సెప్టెంబర్ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తర్వాత హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్స్ లేకుండా రోడ్డెక్కే వాహనాలపై కేసు నమోదు చేస్తారు. అలాగే హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేని వాహనాలకు పొల్యుషన్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ వంటి సేవలను అందించరు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
పాత వాహనదారులు ఈ నెంబర్ ప్లేట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం www.siam.in వెబ్‌సైట్ సందర్శించాలని రవాణాశాఖ తెలిపింది. వాహనాన్ని బట్టి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
హైస్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఏర్పాటుకు చార్జీలు ఇలా ఉంటాయి.?
* ద్విచక్రవాహనం రూ. 320 - రూ. 380
* ఇంపోర్ట్ చేసుకున్న ద్విచక్రవాహనం రూ. 400 - రూ. 500
* ఫోర్ వీలర్‌కు రూ. 590 - రూ. 700
* ఇంపోర్ట్ చేసుకున్న ఫోర్ వీలర్ వెహికిల్‌కు రూ. 700 - రూ. 860.
* మూడు చక్రాల వాహనం రూ. 350 - రూ. 450
* కమర్షియల్ వెహికిల్స్‌కు రూ. 600 - రూ. 800
tollgate atrocity
అసలీ నెంబర్ ప్లేట్ల ఉద్దేశం ఏంటి.?
హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమలు చేయడానికి పెద్ద కారణమే ఉంది. ఈ నెంబర్లను ఉపయోగించడం ద్వారా నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయొచ్చు. దొంగతనాలను అరికట్టవచ్చు. అలాగే వాహనాలకు రహదారి భద్రత లభిస్తుంది. ఇలాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఈ నిబంధనను తీసుకొచ్చింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ నిబంధనల ఇప్పటికే అమల్లో ఉంది. అయితే తాజాగా పాత వాహనాలకు కూడా దీనిని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.