జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా బాలికలపై ఎలాంటి వేధింపులు లేదా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, అల్లరి చేసే యువకులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అవసరమైన చోట్ల అదనపు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
స్టూడెంట్ వేషంలో రంగంలోకి దిగిన ఎస్సై అమూల్య
ఈవ్ టీజింగ్‌ను పూర్తిగా అరికట్టాలనే ఉద్దేశంతో టేకుమట్ల ఎస్సై అమూల్య వినూత్నంగా వ్యవహరించారు. ఆమె సివిల్ డ్రెస్‌లో, విద్యార్థిని గెటప్‌తో పరీక్షా కేంద్రానికి వెళ్లి విద్యార్థులతో కలిసి ఉండి పరిస్థితులను గమనించారు. చేతిలో ఎగ్జామ్ ప్యాడ్ పట్టుకుని సాధారణ విద్యార్థిలా కేంద్రంలోకి వెళ్లిన ఆమె, బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. ఇలా విద్యార్థుల్లో కలిసిపోయి ఆకతాయిల కదలికలను గమనించడం ద్వారా ఎలాంటి వేధింపులు జరగకుండా ముందుగానే చర్యలు తీసుకున్నారు.
విద్యార్థినుల భద్రతే ముఖ్య లక్ష్యం
ఈ సందర్భంగా ఎస్సై అమూల్య మాట్లాడుతూ, విద్యార్థినుల భద్రత పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎవరైనా ఈవ్ టీజింగ్, వేధింపులు లేదా అనుచిత ప్రవర్తనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికలు ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని, తమ దృష్టి పూర్తిగా చదువుపైనే ఉండాలని ఆమె సూచించారు. ఏ సమస్య ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్పారు. ఇదిలా ఉంటే ఎస్సై అమూల్య విద్యార్థినిగా మారి నిర్వహించిన నిఘా చర్యలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.