
Hyderabad : హైదరాబాద్ ఎంత వేగంగా విస్తరించిందో చెప్పడానికి కూకట్ పల్లి పర్పెక్ట్ ఉదాహరణ. ఒకప్పుడు ఎందుకూ పనికిరాదు అనుకున్న ఈ ప్రాంతం అతితక్కువ సమయంలో ఏ స్థాయిలో మారిపోయిందో చూస్తున్నాం.. చెట్లు, ముళ్లపొదలతో అడవిలా ఉండేది కాస్త మిడిల్ క్లాస్ ప్రజల నివాసానికి అడ్డాగా మారిపోయింది. కూకట్ పల్లితోనే ఆగలేదు... మియాపూర్, చందానగర్, లింగంపల్లి, పటాన్ చెరు వరకు నగరం ఆగకుండా విస్తరిస్తూ పోతోంది.
ఇప్పుడు సంగారెడ్డి వంతు వచ్చింది... హైదరాబాద్ శివారులోని ఈ పట్టణం ఐటీ ఉద్యోగులకు అడ్డాగా మారుతోంది. ఐటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు, నగర శివారులో ప్రశాంత వాతావరణం కలిగివుండటంతో ఇప్పుడు సాప్ట్ వేర్ ఉద్యోగుల కన్ను సంగారెడ్డిపై పడింది. రాబోయే ఐదారు సంవత్సరాల్లో ఈ పట్టణ రూపరేఖలే మారిపోనున్నాయి... ఇది మరో కూకట్ పల్లి అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం సంగారెడ్డిలో రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది. పటాన్ చెరు, ఇస్నాపూర్ నుండి సంగారెడ్డి వరకు హైదరాబాద్-ముంబై హైవే పొడవునా అపార్ట్ మెంట్స్, విల్లాలు వెలుస్తున్నారు. కానీ ఐటీ ఉద్యోగులు సంగారెడ్డిలో ఇండిపెండెంట్ ఇళ్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పట్టణం నుండి హైదరాబాద్ కు ఇప్పటికే మెరుగైన రవాణా ఉంది... భవిష్యత్ లో ఇది మరింత మెరుగుపడబోతోంది. అందుకే ఈ పట్టణం ఫస్ట్ ఛాయిస్ గా మారింది.
సంగారెడ్డిలో ప్రస్తుతం ఇండిపెండెంట్ ఇండ్లు రూ.40-50 లక్షల వరకు లభిస్తున్నాయి. హైవేకు ఆనుకుని ఉండే సంగారెడ్డి చౌరస్తా, కలెక్టరేట్ పరిసరాల్లో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నా పట్టణంలోకి వెళ్లేకొద్దీ ధరలు తగ్గుతాయి. ఇక సంగారెడ్డి-సదాశివపేట మధ్యలో కూడా తక్కువ ధరకే ఇళ్లు లభిస్తున్నాయి. భవిష్యత్ లో ఈ పట్టణ రూపురేఖలు మార్చే ప్రాజెక్టులు రాబోతున్నాయి... అందుకే ఇప్పుడే తక్కువ ధరలో ఇళ్లు కొనేందుకు ఐటీ ఉద్యోగులే కాదు సామాన్య ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
హైదరాబాద్ శివారులో ఉండటంతో సంగారెడ్డిలో అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చేసింది. అయితే నగరంలో మాదిరిగా కాకుండా ఇక్కడ కాస్త బడ్జెట్ ధరల్లో ప్లాట్స్ లభిస్తున్నారు. సామాన్య ఉద్యోగులను దృష్టిలో ఉంచుకునే ఎక్కువశాతం అపార్ట్ మెంట్స్ నిర్మిస్తున్నారు... కాబట్టి తక్కువధరకే లభిస్తున్నాయి. రూ.30-40 లక్షలకే మంచి సౌకర్యాలతో కూడిన ప్లాట్స్ సంగారెడ్డిలో అందుబాటులో ఉన్నాయి. లగ్జరీ కావాలంటే మాత్రం ముంబై హైవేకు ఆనుకుని అనేక అపార్ట్ మెంట్స్ ఉన్నాయి... ఇక్కడ ఒక్కో ప్లాట్ రూ.50-80 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.
భారీ ప్రాజెక్టుల రాకతో సంగారెడ్డి రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ కేక్‌లా మారింది. ఒకప్పుడు కేవలం జిల్లా కేంద్రంగానే ఉన్న సంగారెడ్డి, ఇప్పుడు తెలంగాణలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోంది. త్వరలోనే ఇది హైదరాబాద్ లో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
1. రీజనల్ రింగ్ రోడ్డు (RRR)
సంగారెడ్డి ఇప్పటికే వేగంగా డెవలప్ అవుతోంది. దీన్ని జెట్ స్పీడ్ కు తీసుకెళుతోంది రీజనల్ రింగ్ రోడ్డు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ చూట్టూ ఉన్న రింగ్ రోడ్డు తరహాలోనే మరో రోడ్డు నిర్మించాలని భావిస్తోంది. నగరం వేగంగా విస్తరిస్తున్న క్రమంలో RRR నిర్మాణానికి పూనుకున్నారు. ఇది సంగారెడ్డి మీదుగానే వెళుతోంది. దీంతో ఒక్కసారిగా ఈ పట్టణంలో రియల్ బూమ్ పెరిగింది... ఈ రీజనల్ రింగురోడ్డు పూర్తయితే సంగారెడ్డి రూపురేఖలు మారడం ఖాయం.
2. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)
రీజనల్ రింగ్ రోడ్ (RRR),ఔటర్ రింగ్ రోడ్ (ORR) మధ్య ఉండటం సంగారెడ్డికి బాగా కలిసొచ్చే అంశం. ఓఆర్ఆర్ ద్వారా నగరం లోపలికి సులభంగా వెళ్లగలిగితే, ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే ఇతర జిల్లాల నుంచి సంగారెడ్డికి రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్ ద్వారా సంగారెడ్డి నుండి ఐటీ ఏరియాలు గచ్చిబౌలి, హైటెక్ సిటీకి తొందరగా చేరుకోవచ్చు. అందుకే ఐటీ ఉద్యోగులు సంగారెడ్డి ఇళ్లు, ప్రాపర్టీస్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
3. హైదరాబాద్ ఐఐటీ
సంగారెడ్డి ప్రాంతం గ్లోబల్ మ్యాప్‌లో నిలవడానికి మరో ప్రధాన కారణం కందిలోని ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad). ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ వల్ల ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ హబ్‌గా గుర్తింపు పొందింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు సంగారెడ్డి పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చాయి. పిల్లల చదువుకు కూడా అనుకూలంగా ఉండటం కూడా సంగారెడ్డిని నివాస ప్రాంతంగా ఎంపిక చేసుకోడానికి మరో కారణం.
4. మెట్రో సదుపాయం, హైవే విస్తరణ
హైదరాబాద్ మెట్రోను పటాన్ చెరు, ఇస్నాపూర్ వరకు విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని సంగారెడ్డి వరకు విస్తరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇదే జరిగితే రవాణా సదుపాయం మరింత మెరుగుపడి ఈ పట్టణం ఊహించని స్థాయిలో డెవలప్ అవుతుంది. ఇస్నాపూర్ వరకు మెట్రో వచ్చినా ఐటీ ఉద్యోగుల రాకపోకలకు మరింత అనువుగా మారుతుంది.
మదీనాగూడ నుండి సంగారెడ్డి వరకు ముంబై హైవే విస్తరణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. హైవేను ఆరు వరుసలుగా విస్తరించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి, హైదరాబాద్ ప్రధాన ప్రాంతాల నుండి తక్కువ సమయంలోనే సంగారెడ్డికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ కనెక్టివిటీ కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు నివాస ప్రాంతంగా సంగారెడ్డిని ఎంచుకుంటున్నారు.
5. పారిశ్రామిక అభివృద్ధి..
సంగారెడ్డి సమీపంలోని జహిరాబాద్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిమ్జ్ (NIMZ - National Investment and Manufacturing Zone) వంటి భారీ పారిశ్రామిక ప్రాజెక్టును చేపట్టింది. దీనివల్ల వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి.. దీంతో సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో గృహ అవసరాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ప్రాజెక్ట్ కూడా సంగారెడ్డి డెవలప్మెంట్ ను నెక్ట్స్ స్టేజ్ కు తీసుకెళుతుందని నమ్ముతున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడమే మంచిది.