Telangana Pensions: తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పింఛన్ల మంజూరు ప్రక్రియకు సంబంధించి అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.
కొత్త పింఛన్ల అర్హతలపై వస్తున్న సందేహాలకు ప్రభుత్వం తెరదించింది. గత ప్రభుత్వాల కాలంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉన్న అర్హతలనే ప్రస్తుతం కూడా అమలు చేస్తున్నట్లు తెలిపింది. అంటే కొత్తగా ఎలాంటి అర్హతలు లేదా అదనపు నిబంధనలు విధించలేదని స్పష్టం చేసింది. అర్హత ఉన్న వారికి మాత్రమే పరిశీలన అనంతరం పింఛన్లు మంజూరు చేస్తామని పేర్కొంది.
25
తొలి దశలో వీరికి ప్రాధాన్యం
కొత్త పింఛన్ల మంజూరులో మొదటి విడతలో కొన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీరిలో వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సంబంధించిన దరఖాస్తులను ముందుగా పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయనున్నారు.
35
మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా.?
ప్రజాపాలన వారోత్సవాలు, ప్రగతి ప్రణాళిక గ్రామసభలు లేదా ప్రజావాణి కార్యక్రమాల్లో ఇప్పటికే దరఖాస్తు చేసి, అవసరమైన అన్ని ధ్రువపత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు అసలు దరఖాస్తు చేయని వారు లేదా గతంలో దరఖాస్తు చేసినప్పటికీ అవసరమైన పత్రాలు సమర్పించని వారు మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి. ఒంటరి మహిళలు సెపరేషన్ సర్టిఫికెట్ లేదా స్థానిక అధికారుల విచారణ రిపోర్టు ఇవ్వాలి. గీత కార్మికులు ఎక్సైజ్ శాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం అందించాలి. చేనేత కార్మికులు చేనేత, జౌళి శాఖ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా బాధితులు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి.
55
దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు.?
కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తులు స్వీకరించిన వెంటనే వాటి వివరాలను చేయూత ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికీ వెళ్లి అర్హతలను పరిశీలిస్తారు. వితంతువులు, ఒంటరి మహిళలు అవసరమైన పత్రాలు పొందేందుకు ఐకేపీ, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు సహాయం అందిస్తాయి. ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అర్హుల జాబితాను జిల్లా అధికారులకు పంపిస్తారు. జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపిన అనంతరం పింఛన్ మంజూరు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రభుత్వ పథకాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పూర్తిగా పారదర్శకంగా పింఛన్లు అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు.