ఈ పథకంలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. రేషన్ కార్డు తప్పనిసరి కాదు. రేషన్ కార్డు ఉన్నవారి కుటుంబ వివరాలను అందులోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నమోదు చేస్తారు. కార్డు లేని వారు కూడా ప్రత్యేక దరఖాస్తు ఫారం ద్వారా తమ వివరాలను అందించవచ్చు. ఆధార్ వివరాలతో పాటు కుటుంబ సభ్యుల సమాచారం సమర్పించాల్సి ఉంటుంది. బీమా ప్రయోజనం పొందేందుకు నామినీ వివరాలు నమోదు చేయడం తప్పనిసరి. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనాలనుకుంటే వారికి ఎంత శాతం పరిహారం అందాలనే విషయాన్ని కూడా దరఖాస్తులో స్పష్టంగా తెలియజేయాలి.
డిసెంబర్ 18 వరకు ప్రత్యేక దరఖాస్తు శిబిరాలు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో ప్రజల నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. అర్హులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు (ఉంటే) తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబ వివరాలను సేకరించనున్నారు. ఇతర జిల్లాల్లో నివసిస్తున్న వారు కూడా తమకు సమీపంలోని నమోదు కేంద్రంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
యాప్, వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటి ద్వారా అర్హులైన కుటుంబాలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే యాప్, వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం గీత కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులకు అమలవుతున్న రూ.2 లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని కూడా రూ.5 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నెల రోజుల పాటు జరిగే ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.