Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో

Published : Oct 04, 2026, 07:23 PM IST

Telangana: తెలంగాణలో పాడి పరిశ్రమకు మరింత ఊతమిచ్చే కీలక అడుగు పడింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన అత్యాధునిక డెయిరీ ప్లాంట్ ఏర్పాటుకు భూమిపూజ జరిగింది.

PREV
15
తూప్రాన్‌లో రూ.400 కోట్లతో భారీ డెయిరీ ప్లాంట్

తెలంగాణలో అమూల్ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు తూప్రాన్‌లో భారీ డెయిరీ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. సుమారు రూ.400 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్లాంట్‌కు భూమిపూజ నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్‌రావు సహా పలువురు ప్రజాప్రతినిధులు, అమూల్ సంస్థ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి పాడి పరిశ్రమ అభివృద్ధి, సహకార సంఘాల బలోపేతంపై చర్చించారు. సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఈ పరిశ్రమ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఆధునిక సాంకేతికతతో ప్లాంట్ అందుబాటులోకి వస్తే పాడి రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు.

25
పాడి రైతులకు మార్కెట్.. యువతకు ఉపాధి అవకాశాలు

అమూల్ డెయిరీ ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని పాడి రైతులకు తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ లభించే అవకాశం ఉంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పాలు, పాల ఉత్పత్తుల సేకరణ పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. ప్లాంట్ ద్వారా స్థానిక యువతతో పాటు మహిళలకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుతాయని వివరించారు. తెలంగాణలో మరిన్ని ఆహార, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు.

35
సహకార సంఘాలను బలోపేతం చేయాలి

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. గతంలో గ్రామాల్లో బలంగా ఉన్న సహకార సంఘాలు రాజకీయ జోక్యంతో బలహీనపడ్డాయని వ్యాఖ్యానించారు. వాటిని తిరిగి క్రియాశీలం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు సమష్టిగా ముందుకు వచ్చి సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాడి రైతులు తమ ప్రాంతాల్లో పాల సహకార సంఘాలను బలోపేతం చేసుకుంటే ఉత్పత్తి, మార్కెటింగ్ రెండింటిలోనూ ప్రయోజనం పొందవచ్చని చెప్పారు.

45
తెలంగాణలో 1,525 కొత్త సహకార సంఘాలు

దేశంలో సహకార రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ రంగాన్ని విస్తరించేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో 1,525 కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడించారు. పాల ఉత్పత్తి రంగంలో రైతులను మరింతగా భాగస్వాములను చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని వివరించారు.

55
శ్వేత విప్లవంలో తెలంగాణ ముందుండాలి

ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ రంగంలో తెలంగాణ కూడా తన సామర్థ్యాన్ని పెంచుకోవాలని, దేశంలో జరుగుతున్న శ్వేత విప్లవంలో రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మరోవైపు తెలంగాణలో పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. రాష్ట్రంలోని పాడి రైతులు విజయ డెయిరీపై ఆధారపడి ఉన్నారని, అమూల్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాడి రైతులకు మద్ధతు ధర పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories