Published : Aug 07, 2025, 10:38 PM ISTUpdated : Aug 07, 2025, 10:44 PM IST
Telangana Rains : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు(శుక్రవారం) విద్యాసంస్థలు సెలవు ఇవ్వాలని విద్యార్థుల పేరెంట్ డిమాండ్ చేస్తున్నారు. మరి సెలవు ఉంటుందా?
Hyderabad Rains : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ(గురువారం) సాయంత్రం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. దాదాపు రెండుమూడు గంటలు ఆకాశానికి చిల్లుపడిందా అనేంతలా కుండపోత వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. కొన్నిచోట్ల రోడ్లపైకి మోకాల్లోతు నీరుచేరి వాహనాల రాకపోకలకు కాదు నడిచుకుంటు వెళ్లడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ వర్షాలు ఇంతటితో ఆగవని... రాత్రి మరింత జోరుగా వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరుసగా మూడ్రోజులపాటు ఈ కుండపోత వానలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా రేపు(శుక్రవారం) విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని పేరెంట్స్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి తెలంగాణ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
25
ఆప్షనల్ హాలిడే పూర్తి సెలవుగా మారుతుందా?
ఆగస్ట్ 8న తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంది. తెలుగింటి మహిళలు ఎంతో పవిత్రంగా అమ్మవారిని పూజించుకుంటారు కాబట్టి ఈరోజు సెలవు ప్రకటించారు... ప్రభుత్వ ఉద్యోగులు కావాలనుకుంటే వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు. అలాగే పలు ప్రైవేట్ విద్యాసంస్థలు మరీముఖ్యంగా హిందుత్వ సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సెలవు ఉంది.
అయితే భారీ వర్షాల నేపథ్యంలో రేపు పూర్తిస్థాయి సెలవు ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఒక్కరోజు సెలవు వస్తే తర్వాత రెండ్రోజులు ఆగస్ట్ 9 రెండో శనివారం, ఆగస్ట్ 10న సెలవే. ఈ మూడ్రోజులు తెలంగాణలో భారీ వర్షసూచనలున్నాయి కాబట్టి తమ పిల్లలను ఇళ్లవద్దే ఉండేలా సెలవులు రావడం మంచిదయ్యిందని తల్లిదండ్రులు అంటున్నారు.
35
హైదరబాదీలు జాగ్రత్త
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీగా వర్షపాతం నమోదయ్యింది. రెండుమూడు గంటలు ఏకదాటిగా జడివాన కురిసింది. నగరంలో అత్యధికంగా గచ్చిబౌలిలో 12.3 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. ఇక శ్రీనగర్‌కాలనీలో 11.1, ఖైరతాబాద్‌లో 10.8 సెం.మీ, యూసుఫ్‌గూడలో 10.4 సెం.మీ వర్షం కురిసింది. ఉప్పల్‌లో 9.5 సెం.మీ, ఎల్బీనగర్‌లో 9.3 సెం.మీ, బంజారాహిల్స్‌లో 9 సెం.మీ, నాగోల్‌లో 8.5 సెం.మీ, గోల్కొండ 7.9, బోరబండ 7.5 సెం.మీ వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్షం నేపథ్యంలో మూసీ నదిలోకి భారీ వరదనీరు చేరుతోంది. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది.. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఒక గేటును అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. హిమాయత్‌సాగర్ తో పాటు ఉస్మాన్‌సాగర్ జలపాతం కూడా నిండుకుండలా మారింది.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని... ఏ సమయంలో అయినా సహాయక చర్యలు చేపట్టేందుకు రెడీగా ఉండాలని ముఖ్యమంత్రి అదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షించాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
55
ప్రయాణాలు వాయిదా వేసుకొండి
హైదరాబాద్ సిటీ లో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.