అసలేంటీ జీవో 97.. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? దీంతో ఏం జ‌రుగుతుంది?

Published : Aug 25, 2026, 05:42 PM IST

Telangana: తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్‌ ఎడ్యుకేషన్‌ వ్యవస్థతో అనుసంధానం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన GO 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PREV
15
అస‌లేంటీ జీవో 97.?

తెలంగాణ ప్రభుత్వం జూలై 3న GO 97ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా అప్పటి కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ పేరును ‘SHAKTI’గా మార్చుతూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. SHAKTI అంటే స్కిల్ హ్యుమ‌న్ క్యాపిట‌ల్ అండ్ నాల‌డ్జ్ ట్రైనింగ్ ఇన్షియేటివ్. ఈ కొత్త వ్యవస్థ పరిధిలోకి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు, ఐటీఐలు, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లను తీసుకురావాలని నిర్ణయించింది. అదే సమయంలో పాలిటెక్నిక్‌ విద్యను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో అనుసంధానం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం, ఏఐ, రోబోటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇవ్వడం దీని వెనుక ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఈ మార్పులపై విద్యార్థులు, అధ్యాపక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పాలిటెక్నిక్‌ విద్యను సంప్రదాయ సాంకేతిక విద్యా వ్యవస్థ నుంచి నైపుణ్య శిక్షణ ఆధారిత వ్యవస్థలోకి తీసుకెళ్లడం వల్ల భవిష్యత్‌లో తమ విద్యా అవకాశాలపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

25
పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరుగుతుందని ఆందోళన.?

పాలిటెక్నిక్‌ డిప్లొమా సాధారణంగా సాంకేతిక విద్యలో కీలకమైన కోర్సుగా కొనసాగుతోంది. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఉన్నత విద్యను కొనసాగించే మార్గాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డిప్లొమా తర్వాత ECET ద్వారా బీటెక్‌ రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ పొందే అవకాశం విద్యార్థులకు ఎంతో కీలకం. GO 97 వల్ల తమ డిప్లొమా విద్యను ఐటీఐ తరహా నైపుణ్య శిక్షణతో సమానంగా చూసే పరిస్థితి ఏర్పడుతుందేమోనన్నది విద్యార్థుల ప్రధాన భయం. అలా జరిగితే డిప్లొమాకు ఉన్న అకడమిక్‌ గుర్తింపు తగ్గిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.

అదే సమయంలో ECET ద్వారా బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరే అవకాశం భవిష్యత్‌లో కొనసాగుతుందా లేదా అనే సందేహం కూడా విద్యార్థుల్లో ఉంది. ప్రభుత్వం ఈసెట్‌ ప్రవేశాలు కొనసాగుతాయని మౌఖికంగా హామీ ఇచ్చినప్పటికీ, లిఖితపూర్వకంగా స్పష్టత ఇవ్వాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. మరో అంశం ఫీజులు. పాలిటెక్నిక్‌ కళాశాలలను PPP విధానంలో నడిపితే భవిష్యత్‌లో ఫీజులు పెరిగే అవకాశం ఉందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలా జరిగితే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులపై ఆర్థిక భారం పెరుగుతుందని చెబుతున్నాయి.

35
అధ్యాపకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.?

GO 97పై విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్‌ అధ్యాపకుల్లోనూ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం సాంకేతిక విద్యా వ్యవస్థకు సంబంధించిన నిబంధనలు, క్యాడర్‌ నిర్మాణం, ప్రమోషన్‌ విధానాలతో పనిచేస్తున్న అధ్యాపకులపై శాఖ మార్పు ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థను కొత్త శాఖ పరిధిలోకి తీసుకెళ్లడం వల్ల తమ సర్వీస్‌ క్యాడర్‌, ఉద్యోగ భద్రత, పదోన్నతులు, ఇతర పరిపాలనా అంశాలపై స్పష్టత అవసరం అని అధ్యాపకులు కోరుతున్నారు. ఈ కారణాలతో GO 97ను అమలు చేసే ముందు విద్యార్థులు, అధ్యాపకులు, సాంకేతిక విద్యా నిపుణులతో ప్రభుత్వం విస్తృతంగా చర్చించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

45
తీవ్రంగా మారిన విద్యార్థుల ఆందోళ‌న‌లు

GO 97ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యా మండలి కార్యాలయం వద్ద ABVP ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. హనుమకొండ జిల్లా పరకాలలోనూ పాలిటెక్నిక్‌ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నల్గొండలో పాలిటెక్నిక్‌ విద్యార్థులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుని తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

మరోవైపు GO 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ BRSV ఆధ్వర్యంలోనూ విద్యార్థులు కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు నిర్వహించారు. విద్యార్థులు, SFI కార్యకర్తలు చేపట్టిన నిరసనలను పోలీసులు అడ్డుకోవడం, కొందరిని అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ అరెస్టులను నిరసిస్తూ SFI రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ఇలా ఒకే అంశంపై పలు విద్యార్థి సంఘాలు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడంతో పాలిటెక్నిక్‌ విద్యపై తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చింది.

55
క‌మిటీ ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం

విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం GO 97పై పునఃసమీక్షకు చర్యలు చేపట్టింది. పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్‌ యూనివర్సిటీతో అనుసంధానం చేసే అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కె. కేశవరావును కమిటీ చైర్మన్‌గా నియమించగా, ప్రొఫెసర్‌ కోదండరామ్‌, శాంతా సిన్హా, నవీన్‌ మిట్టల్‌, శక్తి శాఖ కార్యదర్శి, సాంకేతిక విద్య కమిషనర్‌లను సభ్యులుగా నియమించింది.

పాలిటెక్నిక్‌ కళాశాలల విలీనం వల్ల సాంకేతిక విద్యపై పడే ప్రభావం, విద్యార్థుల విద్యా అవకాశాలు, ఇతర సంబంధిత అంశాలను కమిటీ పరిశీలించనుంది. 30 రోజుల్లోగా ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించాల్సి ఉంది. ఆ రిపోర్టు ఆధారంగా GO 97పై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అయితే విద్యార్థి సంఘాలు మాత్రం కమిటీ ఏర్పాటు మాత్రమే సరిపోదని అంటున్నాయి. పాలిటెక్నిక్‌ విద్యను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేయకూడదని, ప్రస్తుత సాంకేతిక విద్యా వ్యవస్థలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ECET లేటరల్‌ ఎంట్రీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. అలాగే పాలిటెక్నిక్‌ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఫీజులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కమిటీ రిపోర్ట్ కోసం వేచి చూస్తుండగా, విద్యార్థి సంఘాలు మాత్రం GO 97ను పూర్తిగా ఉపసంహరించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని చెబుతున్నాయి. దీంతో తెలంగాణలో పాలిటెక్నిక్‌ విద్య భవిష్యత్‌పై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories