
Hyderabad Traffic Diversions : ముస్లింల ఆరాధ్యదైవం మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే పవిత్ర పండగ మిలాద్-ఉన్-నబి. ఈ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి... అందుకే ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా దారుస్సలాంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయి.
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో భారీ 'మిలాద్-ఉన్-నబి జల్సా' (సభ) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో సామాన్య ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ జనసందోహం కారణంగా దారుస్సలాం, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులను (Traffic Diversions) అమల్లోకి తెచ్చారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దారుస్సలాం వైపు వెళ్లే వాహనాల దారిమళ్లింపుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు నేడు (25.08.2026, మంగళవారం) సాయంత్రం 6:00 గంటల నుండి రేపు (26.08.2026, బుధవారం) తెల్లవారుజామున 4:00 గంటల వరకు అమల్లో ఉంటాయి. దారుస్సలాం వైపు వెళ్లే ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలను నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నట్లు పోలీసులు ప్రకటించారు.
మలకుంట, బేగంబజార్ చత్రి మార్గం
మలకుంట, బేగంబజార్ చత్రి మీదుగా దారుస్సలాం వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను అలస్కా టి-జంక్షన్ (Alaska T-Junction) వద్ద మళ్లించి ఎంజే బ్రిడ్జి (MJ Bridge), ఎంజే మార్కెట్ (MJ Market) వైపు పంపిస్తారు.
మల్లెపల్లి, బోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ మార్గం
మల్లెపల్లి క్రాస్ రోడ్డు, బోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ ప్రాంతాల నుంచి దారుస్సలాం వైపు వచ్చే వాహనాలను అఘాపుర క్రాస్ రోడ్డు (Aghapura Cross Road) వద్ద మళ్లిస్తారు. ఇక్కడి నుంచి వాహనాలు టక్కర్ వాడి మీదుగా చార్మినార్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
బజార్ ఘాట్, తాజ్ ఐలాండ్ మార్గం
తాజ్ ఐలాండ్, బజార్ ఘాట్ వైపు నుంచి దారుస్సలాం దిశగా వచ్చే వాహనాలను ఏక్ మినార్ వద్ద మళ్లిస్తారు. ఈ వాహనాలు బజార్ ఘాట్ మీదుగా నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు ప్రయాణించాలి.
సీతారాంబాగ్, మంగళ్‌హాట్ మార్గం
సీతారాంబాగ్, మంగళ్‌హాట్ వైపు నుంచి దారుస్సలాం వైపు వచ్చే వాహనాలను అఘాపుర జంక్షన్ వద్ద మళ్లించి చర్కండిల్ వైపు పంపుతారు.
మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్ మార్గం
మెహదీపట్నం, ఆసిఫ్‌నగర్ వైపు నుంచి దారుస్సలాంకు వచ్చే వాహనాలను మల్లెపల్లి క్రాస్ రోడ్డు వద్ద మళ్లించి గోకుల్ నగర్, బజార్ ఘాట్ వైపు పంపిస్తారు.
మజ్లిస్ పార్టీ కార్యాలయం దారుస్సలాంలో జరిగే మిలాద్-ఉన్-నబి జల్సాకు వాహనాల్లో వచ్చే వారి కోసం పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. వాహనదారులు తమ వాహనాలను రోడ్లపై కాకుండా నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్క్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఫోర్ వీలర్స్ పార్కింగ్ (4-Wheelers)
కార్లతో పాటు ఇత ఫోర్ వీలర్లలో వచ్చేవారు తమ వాహనాలను గవర్నమెంట్ డిస్పెన్సరీ హాస్పిటల్ (సీతారాంబాగ్) ప్రాంగణంలో లేదా రాకెట్ గ్రౌండ్స్ లో పార్క్ చేసుకోవాలి.
ద్విచక్ర వాహనాల పార్కింగ్ (2-Wheelers)
ద్విచక్ర వాహనాల్లో వచ్చేవారి కోసం అఘా దర్గా, సర్దార్ బేగ్ దర్గా, పాన్ మండి రోడ్డు, ఎస్బిఐ (SBI) రోడ్డు పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
#HYDTPinfo
🚦 Traffic Advisory | Milad-un-Nabi Jalsa
In view of the Milad-un-Nabi Jalsa at AIMIM Party Office, Darussalam, from 6:00 PM on 25.08.2026 to 4:00 AM on 26.08.2026, commuters are advised to avoid the affected routes and follow the suggested alternate routes to ensure… pic.twitter.com/DGGe3fhHf6— Hyderabad Traffic Police (@HYDTP) August 24, 2026
సమయం ప్లాన్ చేసుకోండి : నాంపల్లి, మల్లెపల్లి, అఘాపుర, బేగంబజార్, మెహదీపట్నం, సీతారాంబాగ్ మార్గాల్లో ప్రయాణించాల్సిన వారు ముందస్తుగా ప్లాన్ చేసుకుని బయలుదేరడం మంచిది.
ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోండి : దారుస్సలాం వైపు వెళ్లే ఆలోచన ఉన్న సాధారణ ప్రయాణికులు ఈ సమయాల్లో ఇతర బైపాస్ రూట్లను వినియోగించుకోవాలని పోలీసులు కోరారు.
పోలీసులకు సహకరించండి : క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ, నగరంలో ట్రాఫిక్ సులువుగా సాగేందుకు సహకరించాలని నగర ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం కోరింది.
నగరవాసులు ఈ ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలను గమనించి తమ ప్రయాణాలను సురక్షితంగా, ఆటంకాలు లేకుండా సాగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.