
Telangana Rains : తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్ట్ ఆరంభంనుండే భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తుండగా తాజాగా తీవ్రత మరింత పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొన్నిచోట్ల అయితే రికార్డు స్థాయిలో వానలు పడుతున్నాయి... దీంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా కామారెడ్డి జిల్లాలో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి... గత రాత్రినుండి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది.
ఎడతెరిపి లేకుండా జోరున వర్షం కురుస్తుండటంతో మెల్లిగా నదులు, వాగులు, వంకలు చెరువుల్లో వరదనీటి ప్రవాహం పెరిగి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. కేవలం గంటల వ్యవధిలోనే కామారెడ్డి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొన్ని గ్రామాలను వరదనీరు చుట్టుముట్టడంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు... మరికొన్నిచోట్ల హైవేలు, ప్రధాన రహదారులపై వరద ప్రవాహం చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంత వర్షం గతంలో ఎన్నడూ చూడలేదని కామారెడ్డి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఈ జిల్లాల్లో గత రాత్రినుండి ఇప్పటివరకు ఎంత వర్షపాతం నమోదయ్యిందో తెలిస్తే ఎవరైన ఆశ్చర్యపోవాల్సిందే.
సాధారణంగా 100 లేదా 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయితేనే అల్లకల్లోలం అవుతుంది... అలాంటిది గత 14 గంటల్లో కామారెడ్డి జిల్లాలో ఏకంగా 500 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ నిపుణులు టి. బాలాజి (తెలంగాణ వెదర్ మ్యాన్) వెల్లడించారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలో గత అర్ధరాత్రి 12AM గంటల నుండి ఇవాళ(బుధవారం) ఉదయం 8AM వరకు 136 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని... ఆ తర్వాత వర్షతీవ్రత ఊహించనివిధంగా పెరిగిందని తెలిపారు.
బుధవారం ఉదయం నుండి కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా అత్యంత భారీ వర్షం కురుస్తోంది. ఇలా ఉదయం 8AM నుండి మధ్యాహ్నం 2PM వరకు ఏకంగా 363 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ వేదికన ప్రకటించింది. ఇలా మొత్తంగా చూసుకుంటే కేవలం 14 గంటల్లోనే దాదాపు 500 మిల్లిమీటర్లు అంటే 50 సెంటిమీటర్ల వర్షం కురిసిందని తెలిపారు.
ఇంతటితో వర్షాలు ఆగడంలేవు... కామారెడ్డి జిల్లాల్లో ఈ కుండపోత వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ఈ జిల్లాలో 550-600 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించింది. ప్రస్తుతం కామారెడ్డిలో పరిస్థితి చూస్తుంటే 2023 లో భూపాలపల్లి వరదలు గుర్తుకువస్తున్నాయని... అప్పుడుకూడా ఇలాగే చిట్యాల్ లో ఏకంగా 600 మి.మీ వర్షపాతం నమోదయ్యిందని టి.బాలాజి గుర్తుచేశారు.
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, నిజామాబాద్ మధ్యగల జాతీయ రహదారిపైకి వరదనీరు చేరింది. ఇలా జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డు పైనుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా రెండువైపులా మొహరించారు. ఇలా కామారెడ్డి మీదుగా హైదరాబాద్, నిజామాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయిన నేపథ్యంలో ఈ రూట్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది.
ఇదిలావుంటే భారీ వర్షాత ధాటికి వాగులు వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.. ఇలా ఓ వరద ప్రవాహం కామారెడ్డి - ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డును ధ్వంసం చేసింది. దీంతో లింగంపేట్, ఎల్లారెడ్డి, కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డిలో కూడా గత రాత్రినుండి ఎడతెరిపిలేకుండా ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.
సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో మానేరు నది ప్రమాదకరంగా ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాల్లోని పంటపొలాలను ముంచెత్తుతోంది... ఈ క్రమంలోనే గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు ఎగువ మానేరు వద్ద వరదప్రవాహంలో చిక్కుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి వెంటనే మానేరులో చిక్కుకున్నవారికి కాపాడేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి... దీంతో ధూప్‌సింగ్ తండా చుట్టూ వరదనీరు చేరింది. గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో తండావాసులు ఇళ్లపైకి ఎక్కి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తమను కాపాడాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.
ఇక ఇదే మెదక్ లో ఓ హాస్టల్ ను వరద ప్రవాహం చుట్టుముట్టింది... దీంతో అందులోని 400 మంది విద్యార్థులు ప్రాణభయంతో హాస్టల్ భవనం పైకి ఎక్కారు. విషయం తెలిసి అధికారులు ఫైర్ బోట్ల సాయంతో ఇప్పటికే 150 మందిని బయటికి తీసుకొచ్చారు. మిగిలిన విద్యార్థులను బయటకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక శాఖతో పాటు పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని పిల్లలను కాపాడుతున్నారు.
తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి... ఆగస్ట్ ఆరంభంనుండి కుండపోత వానలు కురుస్తుండగా మద్యలో కొంత విరామం ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు మొదలయ్యాయి... ఈ వర్షాలు ఈ నెలంతా కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ తో పాటు భారీ వర్ష సూచనలున్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. రాజధాని నగరం హైదరాబాద్ తో పాటు కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు అలర్ట్ జారీచేశారు. ఈ జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుసే అవకాశాలున్నాయి. ఇక మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు... అంటే ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయి.
హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు.
హైదరాబాద్ తో పాటు కామారెడ్డి జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని సీఎం రేవంత్ తెలుసుకున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని... లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని... పొంగిపొర్లుతున్న చెరువులు, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు వంకల పరిసరాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు.
హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉత్తరకోస్తా ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశా,రు.
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షసూచనలున్న ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. అల్లూరి, ఏలూరు జిల్లాలకు రేపు, ఎల్లుండి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి... సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.