Telangana: తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేయూత పథకం కింద మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మరింత వేగం పెంచుతోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాఠశాలల్లో అల్పాహారం వంటి కార్యక్రమాల తర్వాత ఇప్పుడు పెన్షన్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో చేయూత పథకం కింద మరో 2 లక్షల మందికి నెలవారీ పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పెన్షన్ల కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించినట్లు చెప్పారు.
25
ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య
తెలంగాణలో ఇప్పటికే లక్షలాది మంది చేయూత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 42.23 లక్షల మంది వివిధ విభాగాల్లో పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులు, బీడీ వర్కర్లు ఉన్నారు. ఈ వర్గాలకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్ అందుతోంది. దివ్యాంగులకు మాత్రం ఎక్కువ మొత్తంగా రూ.4,016 చెల్లిస్తున్నారు. ఈ పథకం పేద కుటుంబాలకు పెద్ద ఆర్థిక సహాయంగా మారింది.
35
పెన్షన్ల తొలగింపుపై వచ్చిన ఆరోపణలకు క్లారిటీ
ఇటీవల కొన్ని వర్గాల నుంచి పెన్షన్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీలో ప్రభుత్వం స్పందిస్తూ, అర్హులైన లబ్ధిదారుల పెన్షన్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని తెలిపింది. కేవలం మరణించిన వారు లేదా అర్హత లేకుండా పొందుతున్న వారి పేర్లను మాత్రమే జాబితా నుంచి తొలగిస్తున్నామని వివరించింది. దీంతో నిజమైన లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం సుమారు 12 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వీటిలో వృద్ధాప్య పెన్షన్ కోసం సుమారు 4 లక్షలు, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కోసం 3.5 లక్షలు, గీత, చేనేత, బీడీ కార్మికుల కోసం 3 లక్షలు, దివ్యాంగుల విభాగంలో సుమారు 72 వేల దరఖాస్తులు ఉన్నాయి. ఈ సంఖ్య ఎక్కువగా ఉండటంతో అర్హుల ఎంపిక ప్రక్రియ అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది.
55
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ లక్ష్యం
దరఖాస్తుల పరిశీలన కోసం జిల్లా స్థాయిలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కలిసి అర్హత ప్రమాణాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నాయి. గ్రామసభలు, ప్రజావాణి, వార్డు సభ వంటి వాటి ద్వారా వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి అత్యంత అవసరమైన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ 2 నుంచి కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో చాలా కాలంగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి.