తెలంగాణలో ఆషాడ మాసం బోనాల సందడి నెలకొంది... గోల్కొండ బోనాలతో హైదరాబాద్ లో వేడుకలు మొదలయ్యాయి. ఇప్పటికే బల్కంపేట, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు కూడా పూర్తయ్యాయి. ఇక మిగిలింది హైదరాబాద్ నగరవ్యాప్తంగా జరుపుకునే బోనాల వేడుకలు. వచ్చే ఆదివారం అంటే జులై 20న జరిగే ఈ వేడుకల కోసం నగరం సిద్దమవుతోంది... అమ్మవార్ల ఆలయాలన్ని ముస్తాబవుతున్నాయి.
వచ్చే ఆదివారం హైదరాబాద్ ప్రజలంతా బోనాల వేడుకల్లో పాల్గొంటారు... ఆడబిడ్డలు బోనమెత్తి మొక్కు చెట్టించుకుంటారు. అమ్మవారిని మేకలు, కోళ్లు బలిచ్చి మటన్, చికెన్ తోని విందు బోజనాలు ఏర్పాటుచేస్తారు. కుటుంబసభ్యులు, చుట్టాలు, స్నేహితులు... ఇలా అందరూ కలిసి విందు, మందుతో సందడి చేస్తారు. ఇక పలహారం బండ్ల ఊరేగింపులు, పోతురాజులు డ్యాన్సులు, శివసత్తుల పూనకాలు... హైదరాబాద్ మొత్తం సందడి సందడిగా ఉంటుంది.
తెలంగాణ ప్రజలు ఎంతో వైభవంగా బోనాల పండగను జరుపుకుంటారు కాబట్టి రెండ్రోజులు సెలవులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బోనాలు జరిగే ఆదివారం ఎలాగే సెలవే... అందుకే సోమవారం కూడా అధికారికంగా సెలవు ప్రకటించింది రేవంత్ సర్కార్. అంటే వచ్చే సోమవారం విద్యాసంస్థలతో పాటు ఉద్యోగులకు కూడా సెలవు వస్తుందన్నమాట.