
తెలంగాణ అసెంబ్లీ ఆదివారం రాష్ట్ర చరిత్రలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీల్లో అమలు చేయడానికి సంబంధించిన రెండు బిల్లులను ఆమోదించింది. ఈ బిల్లులలో తెలంగాణ మునిసిపాలిటీస్ (మూడో సవరణ) బిల్లు 2025, తెలంగాణ పంచాయతీ రాజ్ (మూడో సవరణ) బిల్లు 2025 ఉన్నాయి. వాయిస్ ఓటుతో ఆమోదం పొందాయి.
ఈ నిర్ణయం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు నడుమ తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకు హైకోర్టు ఆదేశించింది.
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2018లో మాజీ సీఎం కే.చంద్రశేఖరరావు ప్రభుత్వం తీసుకువచ్చిన పంచాయతీ రాజ్ చట్టమే ఇప్పుడు అడ్డంకిగా మారిందని ఆయన తెలిపారు.
“50 శాతం రిజర్వేషన్ పరిమితి కారణంగా బీసీలకు 42 శాతం కోటా అమలు కావడంలేదు. గత ప్రభుత్వం తీసుకున్న చట్టాలే ఇప్పుడు సమస్యగా మారాయి” అని ఆయన అన్నారు. అలాగే, గవర్నర్ వద్ద ఆమోదం కోసం పంపిన బిల్లులు అయిదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
హైకోర్టు గడువు దృష్ట్యా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ముసాయిదా తయారు చేసి గవర్నర్‌కు పంపింది. కానీ ప్రతిపక్ష పార్టీలు వెనుక నుంచి లాబీయింగ్ చేసి ఆ ఆర్డినెన్స్‌ను కూడా రాష్ట్రపతి వద్దకు పంపించారని సీఎం ఆరోపించారు.
“ప్రతిపక్షం అవరోధాలు సృష్టిస్తోంది. బీసీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రాచారం చేస్తోంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వం ఈ రిజర్వేషన్లకు బలమైన ఆధారాలను చూపించేందుకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. 2024 ఫిబ్రవరి 4 నుంచి 2025 ఫిబ్రవరి 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా బీసీల జనాభా శాతం 56.33%గా నిర్ధారణ అయింది. ఇందులో హిందూ బీసీలు 46.25%, ముస్లిం బీసీలు 10.08% ఉన్నారని నివేదికలో వెల్లడైంది.
బిల్లులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్‌ను మోసపూరిత సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించగా, బీఆర్‌ఎస్ మాత్రం కాంగ్రెస్ నిజాయితీపై ప్రశ్నలు లేవనెత్తింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. “ప్రభుత్వం నిజంగా బీసీ రిజర్వేషన్ల పట్ల కట్టుబడి ఉంటే, ఆల్-పార్టీ డెలిగేషన్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రపతి ఆమోదం కోసం పోరాడాలి” అని అన్నారు.
మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ.. “42 శాతం రిజర్వేషన్ వల్ల బీసీలకు లోకల్ బాడీల్లో బలమైన ప్రాతినిధ్యం లభిస్తుంది. ఇది సామాజిక న్యాయానికి పెద్ద విజయంగా నిలుస్తుంది” అన్నారు.
బీసీ సంక్షేమ మంత్రి పోన్నం ప్రభాకర్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కోటా ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.
మొత్తం మీద, తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన ఈ రెండు బిల్లులు బీసీ రిజర్వేషన్ల చరిత్రలో కీలక మలుపుగా నిలిచాయి. సెప్టెంబర్ 30లోపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలవుతాయా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదంపై ఆధారపడి ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లులు రాష్ట్ర రాజకీయ, సామాజిక రంగాలలో కీలక చర్చనీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ నిర్ణయం రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
దీని ప్రయోజనాలు గమనిస్తే.. సామాజిక న్యాయం బలోపేతమవుతుంది. బీసీల వాస్తవ జనాభాకు తగ్గట్టుగా ప్రాతినిధ్యం లభించడం వల్ల సమాజంలో సమానత్వం పెరుగుతుంది. లోకల్ బాడీల్లో 42% కోటా కారణంగా బీసీ అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. పల్లె, పట్టణ స్థాయిలో బీసీ నాయకత్వం పెరగడం వల్ల ప్రభత్వ నిర్ణయ ప్రక్రియలో వారి పాత్ర బలపడుతుంది. సర్పంచ్, మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్, వార్డ్ మెంబర్ వంటి పదవుల్లో బీసీ వర్గానికి పెద్ద ఎత్తున అవకాశం దక్కుతుంది. రాబోయే తరాలకు రాజకీయ అవగాహన, నాయకత్వం పెంపొందే అవకాశాలుంటాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
మార్పులు గమనిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలలో సమీకరణాలు మారుతాయి. బీసీ అభ్యర్థుల సంఖ్య ఎక్కువవుతుండటంతో పోటీ తీరులో మార్పులు వస్తాయి. బీసీ వర్గం లోపలే టికెట్ కోసం, నాయకత్వ అవకాశాల కోసం పోటీ ఎక్కువ అవుతుంది. బీసీ వర్గానికి అనుకూలంగా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురావడానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లతో పాటు బీసీ కోటా పెరగడం వల్ల శాసనసభలో, స్థానిక పాలనలో కొత్త సమీకరణాలు ఏర్పడతాయి. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లులు బీసీ వర్గ సాధికారతలో కీలక మలుపుగా చెప్పవచ్చు.