
Sunrisers Hyderabad (SRH): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతాలతో సూపర్ షోగా కొనసాగుతోంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన వైల్డ్ ఫైర్ గేమ్ తో దుమ్మురేపుతోంది. ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తోంది. ఇలాంటి సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్- హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య వివాదం రచ్చ లేపుతోంది. ఇటీవల కాంప్లిమెంటరీ టిక్కెట్ల విషయంలో తలెత్తిన వివాదం మరింత ముదురుతూ ఇరు వర్గాలు బహిరంగంగానే హాట్ కామెంట్స్ చేశాయి. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు కార్పొరేట్ బాక్స్‌ను లాక్ చేయడం, అదనపు పాస్‌లు డిమాండ్ చేయడం, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని ఎస్ఆర్హెచ్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుగుజేసుకుని దర్యాప్తునకు ఆదేశించారు. మరోసారి ఎస్ఆర్హెచ్-హెచ్ సీఏలు ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలు జరిపాయి. ఇరు వర్గాలు కలిసి ముందుకు సాగడానికి అంగీకరించాయి.
ఇదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తన హోమ్ ను మార్చడానికి అంతా సెట్ చేసుకుంటున్నదనే టాక్ కూడా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిగా మారింది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ (SRH) హైదరాబాద్ నుండి మకాం మార్చినట్లయితే, విశాఖపట్నంను తమ కొత్త హోమ్ గ్రౌండ్‌గా పరిగణించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధికారికంగా ఆహ్వానం పంపింది. దీనిపై కూడా ఎస్ఆర్హెచ్ ఆలోచనలు చేస్తోందని సమాచారం.
రాబోయే సీజన్ కాదు.. ఈ సీజన్ నుంచే SRH మిగిలిన మ్యాచ్‌లను విశాఖపట్నంలో నిర్వహించడానికి ACA ముందుకొచ్చిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2025 మధ్యలోనే హైదరాబాద్ టీమ్ కు ఆతిథ్యం ఇవ్వాలనీ, పన్ను ప్రోత్సాహకాలను అందించాలని ప్రతిపాదించింది. HCA-SRH మధ్య ఉచిత టిక్కెట్ల విషయంలో కొనసాగుతున్న వివాదం మధ్య ACA ఆఫర్ వచ్చింది. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు గుప్పించిన SRH హైదరాబాద్‌లోని వారి ప్రస్తుత హోమ్ గ్రౌండ్ నుండి తమ జట్టును వేరే చోటుకు తరలిస్తామని కూడా కామెంట్స్ చేసింది.
ఈ నేపథ్యంలో కావ్య మారన్ నేతృత్వంలోని SRH యాజమాన్యాన్ని సంప్రదించి, వారు హైదరాబాద్‌ను విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటే మద్దతు ఇస్తామని ACA తెలిపింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం SRH హోమ్ గ్రౌండ్ గా ఉంది. ఇప్పటికే ఏపీలోని విశాఖపట్నం ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం GMR గ్రూప్ యాజమాన్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌కు రెండో హోమ్ గ్రౌండ్‌గా ఉంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో విశాఖపట్నం రెండు IPL మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఢిల్లీ-లక్నో, ఢిల్లీ-హైదరాబాద్ మ్యాచ్ లు జరిగాయి. ఈ మ్యాచ్ లకు భారీ సంఖ్యలో జనాలు హాజరయ్యారు.
ఇటీవల ACA విశాఖపట్నం స్టేడియంను మెరుగుపరిచింది. టాయిలెట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను, కార్పొరేట్ బాక్సుల వంటి విలాసవంతమైన సౌకర్యాలను మరింత మెరుగుపరిచింది. "వైజాగ్ స్టేడియంలో 28,000 సీటింగ్ సామర్థ్యం మాత్రమే ఉన్నందున, ఐపిఎల్ ఫ్రాంచైజీలు ఒక్కొక్కరికి దాదాపు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లవచ్చు. దీనిని తగ్గించడానికి, వైజాగ్ స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్‌కు రూ. 1 కోటి వరకు ఎస్జిఎస్టి పన్ను ప్రయోజనాన్ని మేము అందించాము" అని ఏపీఏ అధికారి ఒకరు తెలిపినట్టు టీఎన్‌ఐఈ నివేదికలు పేర్కొంటున్నాయి.
SRH తమ సొంత మైదానాన్ని మార్చాలని నిర్ణయించుకుంటే, వారు తమ బ్రాండ్ గుర్తింపుకు సరిపోయేలా స్టేడియం రంగు థీమ్‌ను మార్చాల్సి ఉంటుంది. SRH థీమ్‌తో స్టేడియంను రీబ్రాండ్ చేయడానికి రూ. 10 కోట్లు అవసరమవుతాయని అంచనా. ప్రస్తుతం, స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ థీమ్‌ను కలిగి ఉంది.
భారత్ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 కు ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖపట్నం ప్రారంభ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఈవెంట్‌ను APకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం, ACA BCCI-ICCతో చర్చలు జరుపుతున్నాయి.
ఇటీవల, మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ ఐసిసి చీఫ్ జై షాతో పలు సందర్భాల్లో సమావేశమై కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం, మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం, రాష్ట్రానికి మరిన్ని మ్యాచ్‌లను తీసుకురావడం వంటి అంశాలను చర్చించారు. చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే మహిళల ప్రపంచ కప్ ప్రారంభోత్సవానికి, మొదటి మ్యాచ్‌కు వైజాగ్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చే అవకాశముంది.
దీంతో పాటు వైజాగ్‌లో మరిన్ని T20, ODI మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడానికి BCCI సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఏపీలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే జాతీయ మ్యాచ్ లతో పాటు మరిన్ని IPL మ్యాచ్‌లను వైజాగ్‌లో నిర్వహించాలని ACA టార్గెట్ గా పెట్టుకుంది. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈ సీజన్ లో హోమ్ గ్రౌండ్ ను మార్చకపోయినా.. వచ్చే సీజన్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.