దేశంలో వరి అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ టాప్ లో ఉంటాయి. అలాంటి రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటడం ప్రజలను కంగారుపెడుతోంది. ఇందుకు కారణమేంటో తెలుసా?
తెలుగు ప్రజల నిత్య జీవితంలో బియ్యం ఎంతో కీలకమైంది... ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోనే అన్నం ఎక్కువగా తింటారు. ఉదయం పూట తినే టిఫిన్ల నుండి రాత్రి భోజనం వరకు బియ్యంతో చేసిన పదార్థాలే ప్రధాన ఆహారంగా ఉంటాయి. అయితే గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో సన్నబియ్యం (Fine Quality Rice) ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మధ్యతరగతి, పేద కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. కేవలం రెండు నెలల స్వల్ప వ్యవధిలోనే బియ్యం ధరలలో భారీగా మార్పులు రావడం వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
24
రెండు నెలల్లోనే కిలో బియ్యంపై రూ. 10 నుండి 20 వరకు పెంపు
మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే సామాన్యులను భయపెడుతున్నాయి. ఇప్పుడు బియ్యం ధరలు పెరుగుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రెండు నెలల క్రితం వరకు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 50 నుండి రూ. 55 వరకు లభించిన సన్నరకం బియ్యం, ప్రస్తుతం ఏకంగా రూ. 10 నుండి రూ. 20 వరకు పెరిగాయి. దీంతో ఇప్పుడు కిలో సన్నబియ్యం ధర రూ. 60 నుండి రూ. 70కి చేరింది. సోనా మసూరి, బీపీటీ, హెచ్‌ఎంటీ వంటి ప్రముఖ సన్న రకాల ధరలన్నీ దాదాపు ఇదే రీతిలో పెరిగాయి. 25 కిలోల బియ్యం బస్తాపై రూ. 250 నుండి రూ. 500 వరకు పెరిగినట్లు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు కూడా ధరల పెంపును ధ్రువీకరిస్తున్నారు.
34
ధరల పెంపునకు ప్రధాన కారణాలేంటి?
సన్నబియ్యం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని మిల్లుల యజమానులు, ధాన్యపు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
సన్నరకం ధాన్యం లభ్యత తగ్గడం : గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో సన్నరకం పంట దిగుబడి రాకపోవడం, మిల్లుల్లో నిల్వలు క్రమంగా తగ్గిపోవడంతో స్థానిక మార్కెట్లలో సన్నబియ్యానికి కొరత ఏర్పడింది.
పౌరసరఫరా శాఖ దగ్గరే భారీగా సరుకు : రైతుల నుండి ప్రభుత్వం సన్నరకం బియ్యంను భారీగా సేకరించింది. ప్రస్తుతం పౌరసరఫరా శాఖ వద్ద అవసరానికి మించిన బియ్యం ఉంది. ఇది కూడా బియ్యం ధరలు పెరగడానికి కారణం అయ్యింది.
పొరుగు రాష్ట్రాల నుండి విపరీతమైన డిమాండ్ : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు సన్నబియ్యం భారీగా ఎగుమతి అవుతోంది. ఆయా రాష్ట్రాల్లో సన్నబియ్యానికి డిమాండ్ విపరీతంగా పెరగడంతో అక్కడి వ్యాపారులు ఎక్కువ ధర చెల్లించి ఇక్కడి నుండి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రభావం స్థానిక మార్కెట్లపై పడి ధరలు ఆకాశాన్నంటాయి.
సాధారణంగా 4 నుంచి 5 మంది ఉన్న ఒక సగటు కుటుంబానికి నెలకు కనీసం 25 నుండి 40 కిలోల బియ్యం అవసరమవుతాయి. బియ్యం ధరలు కిలోపై రూ. 15 నుండి 20 వరకు పెరగడంతో ప్రతి కుటుంబంపై నెలకు రూ. 500 నుండి రూ. 800 వరకు అదనపు భారం పడుతోంది. కేవలం ఇళ్లలోనే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, కర్రీ పాయింట్లు నిర్వహించే వారిపై కూడా ఈ భారం స్పష్టంగా కనిపిస్తోంది. బియ్యం ధరలు పెరగడంతో రాబోయే రోజుల్లో హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, రాబోయే కొత్త పంట చేతికి వచ్చే వరకు సన్నబియ్యం ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైస్ మిల్లులలో నిల్వల కృత్రిమ కొరత ఏర్పడకుండా చూడాలని, స్థానిక వినియోగదారులకు అందుబాటు ధరల్లో బియ్యం లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.