LPG: ఇక‌పై ఇళ్ల‌లో గ్యాస్ సిలిండ‌ర్లు క‌నిపించ‌వా.? కేంద్రం కీల‌క అడుగులు

Published : Aug 23, 2026, 10:20 PM IST

LPG: దేశంలో వంట గ్యాస్ వినియోగ విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఎల్‌పీజీ సిలిండర్లపై ఆధారపడటాన్ని తగ్గించి, పీఎన్‌జీ వినియోగాన్ని పెంచే దిశ‌గా కీలక నిర్ణ‌యం తీసుకుంది.

PREV
15
ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడల్ అధికారి

పీఎన్‌జీకి మారే ప్రక్రియను సమన్వయం చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ ఆగస్టు 21న రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. జిల్లాస్థాయిలో ప్రభుత్వ విభాగాలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, వినియోగదారుల మధ్య సమన్వయం అవసరం అని కేంద్రం అభిప్రాయపడింది. పీఎన్‌జీకి మారే సమయంలో ఎదురయ్యే పరిపాలనా సమస్యలను నోడల్ అధికారి పరిష్కరించేలా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

25
పీఎన్‌జీ అందుబాటులో ఉన్న ఇళ్లపై దృష్టి

ప్రస్తుతం పైప్‌లైన్ ద్వారా పీఎన్‌జీ సరఫరా జరుగుతున్న ప్రాంతాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇలాంటి ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు ఎల్‌పీజీ సిలిండర్లకు బదులుగా పీఎన్‌జీ కనెక్షన్ తీసుకునేలా చర్యలు చేపట్టనుంది. పీఎన్‌జీ కనెక్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఎల్‌పీజీ వినియోగం కొనసాగకుండా నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో ఉన్న వినియోగదారుల వివరాలను గుర్తించి, వారికి అవసరమైన సమాచారం అందించే బాధ్యతను సంబంధిత అధికార యంత్రాంగం తీసుకోనుంది.

35
నిబంధనలు పాటించకపోతే ఎల్‌పీజీ నిలిపివేత

పీఎన్‌జీ సౌకర్యం ఉన్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. అత్యవసర వస్తువుల చట్టం-1955 కింద జారీ చేసిన నిబంధనల ప్రకారం, పీఎన్‌జీ సౌకర్యం ఉన్న కుటుంబాలు ఎల్‌పీజీ కనెక్షన్‌ను కొనసాగించకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అధికారులు ముందుగా సంబంధిత వినియోగదారులకు నోటీసులు జారీ చేసి పీఎన్‌జీ కనెక్షన్ తీసుకోవాలని సూచించవచ్చు. ఆ తర్వాత కూడా స్పందించకుండా ఎల్‌పీజీ వినియోగాన్ని కొనసాగిస్తే కనెక్షన్‌ను నిలిపివేసే అధికారం అధికారులకు ఉంటుంది. అయితే ఈ చర్యలు పీఎన్‌జీ నెట్‌వర్క్ వాస్తవంగా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే అమలయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

45
నోడల్ అధికారుల బాధ్యతలు ఇవే

జిల్లాల్లో నియమించే నోడల్ అధికారులకు పలు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పీఎన్‌జీ కనెక్షన్ల ఏర్పాటుకు సంబంధించి హౌసింగ్ సొసైటీలు, స్థానిక సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందడంలో సహకరించడం ఇందులో ఒకటి. అలాగే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మధ్య సమన్వయం చేయడం, వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, కనెక్షన్ల ప్రక్రియను వేగవంతం చేయడం వంటి పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా ఎదురయ్యే ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత కూడా నోడల్ అధికారులపై ఉండనుంది.

55
దిగుమతి గ్యాస్‌పై ఆధారపడటం తగ్గించడమే లక్ష్యం

ఎల్‌పీజీ సరఫరా విషయంలో అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో దేశీయ ఇంధన భద్రతపై కేంద్రం దృష్టి పెట్టింది. 2026 ప్రారంభంలో పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల సమయంలో ఎల్‌పీజీ సరఫరాపై అంతరాయాల ప్రభావం కనిపించింది. దీనికి భిన్నంగా దేశీయంగా లభించే పీఎన్‌జీ సరఫరా స్థిరంగా కొనసాగింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడే ఎల్‌పీజీ వినియోగాన్ని క్రమంగా తగ్గించి, దేశీయ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోంది. పీఎన్‌జీ వినియోగం పెరగడం వల్ల సిలిండర్ల రవాణా, నిల్వ, పంపిణీకి సంబంధించిన భారాన్ని కూడా తగ్గించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. పీఎన్‌జీని పర్యావరణపరంగా అనుకూలమైన ఇంధనంగా కూడా పరిగణిస్తోంది.

అయితే దేశవ్యాప్తంగా వెంటనే ఎల్‌పీజీ సిలిండర్లను పూర్తిగా తొలగించే నిర్ణయం తీసుకున్నట్లు భావించాల్సిన అవసరం లేదు. పీఎన్‌జీ పైప్‌లైన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మార్పును వేగవంతం చేయడమే ప్రస్తుత చర్యల ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం రాష్ట్రాలు త్వరగా జిల్లా నోడల్ అధికారులను నియమించి వారి వివరాలను కేంద్రానికి పంపాలని ఆదేశించింది.

Read more Photos on
click me!

Recommended Stories