Revanth Reddy: కేటీఆర్ అడ్డాలో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన సీఎం

Published : Sep 30, 2026, 08:34 PM IST

Revanth Reddy: కేటీఆర్ అడ్డా సిరిసిల్ల‌లో నిర్వహించిన ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒకప్పుడు చేనేతకు ప్రసిద్ధి చెందిన సిరిసిల్ల‌ ప్రాంతాన్ని గత పాలకులు సమస్యల కేంద్రంగా మార్చారని ఆరోపించారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే

PREV
15
నేతన్నల కన్నీళ్లకు గత పాలకులే కార‌ణం

సిరిసిల్ల అంటే సిరులకు నిలయమని, ధైర్యం, దైవం కలిసి వెలిసిన ప్రాంతమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చేనేత కార్మికులు తమ నైపుణ్యంతో ప్రత్యేకమైన వస్త్రాలను రూపొందించి సిరిసిల్లకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి ప్రాంతంలో కార్మికుల ఆత్మహత్యలు, ఆందోళనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ నేత కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఉపాధి అవకాశాలు లేక పలువురు కార్మికులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గల్ఫ్‌లో కార్మికులు మృతి చెందిన సందర్భాల్లో వారి కుటుంబాలకు, మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావడంలో అప్పటి ప్రభుత్వం తగిన సహకారం అందించలేదని ఆరోపించారు. సిరిసిల్ల ప్రజల సంక్షేమం గురించి గత పాలకులు నిజంగా ఆలోచించి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు.

25
కేటీఆర్ రాజకీయ ప్రవేశంపై సీఎం విమర్శలు

సిరిసిల్ల రాజకీయ పరిణామాలను ప్రస్తావించిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన స్థానిక నాయకులకు అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను అమెరికా నుంచి తీసుకొచ్చి సిరిసిల్ల నుంచి పోటీ చేయించారని విమర్శించారు. 2009 నుంచి 2026 వరకు కేటీఆర్‌కు ఆరుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ నియోజకవర్గంలోని నేత కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు.

సిరిసిల్ల ప్రజల ఓట్లను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టుకుందని విమర్శించారు. వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని సీఎం ఆరోపణలు చేశారు. అయితే సాధారణ ప్రజల కుటుంబాల కష్టాలను పట్టించుకోలేదని మండిపడ్డారు.

35
కాళేశ్వరం, ఇసుక వ్యవహారాలపై ఆరోపణలు

కేసీఆర్ కుటుంబ ఆస్తులపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యాపారాలు చేయకుండా అంత భారీగా ఆస్తులు ఎలా కూడబెట్టారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. మానేరు ప్రాంతంలోని ఇసుక తవ్వకాల విషయంలోనూ కేటీఆర్‌, సంతోష్‌రావు, రవీందర్‌రావుపై రేవంత్‌ ఆరోపణలు చేశారు. ఇసుకను విచ్చలవిడిగా తరలించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. అవినీతిని ప్రశ్నించిన వారిపై కూడా గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయని సీఎం ఆరోపించారు.

45
నేత కార్మికుల సంక్షేమమే ల‌క్ష్యంగా..

గత ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమం కోసం పదేళ్లలో రూ.2,234 కోట్లు ఖర్చు చేసిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం రెండున్నరేళ్ల ప్రజాపాలనలోనే నేత కార్మికుల కోసం రూ.1,731 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఈ జిల్లాకు రెండున్నరేళ్ల కాలంలో సుమారు రూ.1,700 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. నేత కార్మికులతో పాటు గీత కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం పేర్కొన్నారు. గత పాలనలో హామీలకే పరిమితమైన సమస్యలకు తమ ప్రభుత్వం పరిష్కార మార్గాలను చూపుతోందన్నారు. సిరిసిల్లను తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు.

55
వచ్చే ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణులకు సీఎం పిలుపు

సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై కూడా రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో బీఆర్‌ఎస్ రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలకాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేసే నాయకుడికి మంత్రివర్గంలోకి తీసుకుంటామ‌ని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్మశాలి వర్గానికి చెందిన అభ్యర్థిని మండలికి పంపాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని సీఎం అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories