Rain Alert: జాగ్ర‌త్త సుమీ.. ఈ ప్రాంతాల్లో వ‌చ్చే నాలుగు రోజులు వ‌ర్షాలే, వ‌ర్షాలు, ఎల్లో అల‌ర్ట్ జారీ..

Published : Jun 23, 2025, 07:52 AM ISTUpdated : Jun 23, 2025, 07:53 AM IST

రుతుప‌వ‌నాల ఎంట్రీ త‌ర్వాత కూడా ఆశించిన స్థాయిలో వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డారు. ముందుగానే రుతుప‌వ‌నాలు వ‌చ్చినా ఉష్ణోగ్ర‌త‌లు పెరిగాయి. అయితే ఇలాంటి త‌రుణంలో మారిన వాతావ‌ర‌ణం ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది. 

PREV
15
తెలంగాణ‌లో నాలుగు రోజులు వ‌ర్షాలు

తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ నుంచి వర్ష సూచనలు వెలువడ్డాయి. నేటి నుంచి (సోమ‌వారం) వచ్చే నాలుగు రోజులు రాష్ట్రం అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించారు.

25
ఎల్లో అల‌ర్ట్ జారీ

ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్‌’ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సోమ‌వారం ముఖ్యంగా ములుగు, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

మంగ‌ళ‌వారం కూడా రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లు చోట్ల విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

35
హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్

హైద‌రాబాద్‌లో సోమ‌వారం వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. ఉద‌యం నుంచీ ఆకాశం మేఘావృత‌మైంది. అలాగే వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. సాయంత్రం తర్వాత వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 

దీంతో నగర వాసులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్ తీగలు, చెట్లు, బానర్లు వంటి వాటి కింద నిల‌బ‌డ‌కుండా ఉండాల‌ని సూచించారు.

45
రైతులకు ఉపశమనం

మే 27నే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇది సాధారణంగా జూన్ 10 తర్వాత జరుగుతుంది. అయితే రుతుప‌వ‌నాలు ముందుగా వ‌చ్చినా ఆశించిన విధంగా వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. జూన్ మొదటి వారంలో ఎండలు తీవ్రంగా ఉండటంతో విత్తనాలు వేసిన రైతులు వర్షాల కోసం ఎదురుచూశారు.

ఇప్పుడు వాతావరణ శాఖ సూచించిన నాలుగు రోజుల వర్ష సూచనతో రైతులు కొంతవరకూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంటల విత్తనాలు వేసిన వారు ఈ వర్షాలతో పంట సాగు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

55
ఏపీలో కూడా తేలికపాటి వర్షాలు

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లోనూ వర్ష సూచనలు ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది.

వర్షాల సమయంలో చెట్ల కింద, ఫ్లెక్స్ హోర్డింగ్‌ల దగ్గర నిల‌బ‌డ‌కూడ‌ద‌ని, బలమైన గాలులకు అవి కూలే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories