
Telangana Power Cuts : సాధారణంగా వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు అధికంగా ఉంటాయి... వర్షం కురిసే సమయంలోనే కాదు మిగతా సమయాల్లో కూడా వివిధ కారణాలతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. ఇక కొన్నిసార్లు సాంకేతిక సమస్యల కారణంగా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ముఖ్యంగా ఈదురుగాలులు, పిడుగుపాట్ల కారణంగా పోల్స్ దెబ్బతినడం, తీగలు తెగిపడటం, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం... ఇలా వర్షాకాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించే కారణాలు అనేకం ఉన్నాయి.
అయితే పల్లెటూళ్లు, చిన్నచిన్న పట్టణాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా పెద్దగా సమస్య ఉండదు... కానీ హైదరాబాద్ వంటి మహానగరాల్లో కరెంట్ పోతే చాలా కష్టం. అన్ని పనులకోసం ఎలక్ట్రిక్ వస్తువులను ఎక్కువగా వినియోగిస్తుంటారు నగరవాసులు.. అలాంటప్పుడు విద్యుత్ సమస్యలు తీవ్ర ఇబ్బంది పెడతాయి.
సాంకేతిక కారణాలతో కరెంట్ పోతే ఏం చేయలేం... కానీ అధికారులు మెయింటెనెన్స్ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ముందుగానే సమాచారం ఇస్తారు. దీని ప్రకారం ముందుగానే ప్లాన్ చేసుకుంటే కరెంట్ పోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇలా ఇవాళ(జూలై 17 మంగళవారం) హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎలక్ట్రిసిటి అధికారులు ప్రకటించారు. కాబట్టి ఏ ప్రాంతాల్లో ఎంతసేపు కరెంట్ ఉండదో ఇక్కడ తెలుసుకుందాం. ఆ ప్రాంతాల ప్రజలు దీన్ని దృష్టిలో ఉంచుకుంటే చాలు... కరెంట్ లేకున్నా సమస్య ఉండదు.
ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. వర్షాకాలంలో ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ వైర్లు, పోల్స్ పై పడే అవకాశం ఉంటుంది.. కాబట్టి ముందుగానే ఇలా ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను నరికివేయిస్తుంటారు. దీంతోపాటు మరికొన్ని మెయింటెనెన్స్ పనులకోసం అంబర్ పేట పరిధిలోని విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
అంబర్ పేట, విద్యానగర్, కాచీగూడ ప్రాంతాల్లో ఉదయం నుండే విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. ఫీవర్ హాస్పిటల్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ప్రకటించారు . దీని పరిధిలోకి వచ్చే ఫీవర్ హాస్పిటల్, అంజయ్య క్వార్టర్స్, విద్యానగర్, బర్కత్ పురా పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదన్నమాట.
ఇక బర్కత్ పురా బస్ డిపో ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. మెయింటెనెన్స్ పనుల తర్వాత తిరిగి కరెంట్ సరఫరాను పునరుద్దరిస్తారు. ఈ ఫీడర్ పరిధిలోని రత్న నగర్, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అరవింద్ డిగ్రీ కాలేజీ పరిసర ప్రాంతాలున్నాయి... ఇక్కడ మధ్యాహ్నమంతా కరెంట్ ఉండదు.
కాచీగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో కూడా మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. కాచీగూడ రైల్వే స్టేషన్ ఫీడర్ పరిధిలో మెయింటెనెన్స్ పనుల నిమిత్తం కరెంట్ తీసేయనున్నారు. మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంటలవరకు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు బస్ డిపో, బిజెపి ఆపీస్ లేన్, పారగాన్ అపార్ట్ మెంట్ లేన్, వైఎంసిఏ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు.
ఇలా విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాల ప్రజలు ముందుగానే జాగ్రత్తపడితే మంచిది. మీ ఫోన్లను ఫుల్ చార్జింగ్ చేసుకోవాలి... లేదంటే ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అలాగే ఈవి స్కూటర్లు, కార్లను కూడా ఫుల్ చార్జింగ్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ వస్తువుల అవసరం ఉంటే ఎప్పుడు ఉపయోగించాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.
వ్యాపార సముదాయాల్లో అయితే విద్యుత్ కోతల వేళ బిజినెస్ కు ఇబ్బందిలేకుండా జనరేటర్లు లేదంటే ఇన్వర్టర్లు రెడీ చేసుకోవాలి. పెద్దపెద్ద అపార్ట్ మెంట్స్ లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కారణంగా లిప్టులు పనిచేయవు. కాబట్టి అందులో ఉండే ప్రజలు కరెంట్ ఉన్న సమయంలో పనులు చక్కబెట్టుకోవాలి.
హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఎక్కడ ఎలాంటి విద్యుత్ సమస్యలున్నా పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది సిద్దంగా ఉంటారు.. ఇందుకోసం మనం చేయాల్సిందల్లా సమస్యను తెలియజేయడమే. ఇందుకోసం రాష్ట్ర విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లను నిర్వహిస్తోంది... ఫోన్ చేసి సమస్య చెబితే చాలు అధికారులు పరిష్కారానికి చర్యలు చేపడతారు.
విద్యుత్ కోతలతో పాటు ఇతర ఎలక్ట్రిసిటీ సమస్యల కోసం TSNPDCL టోల్ ఫ్రీ నంబర్ 1800-4252424 కు గానీ TSSPDCL నంబర్ 1800-599-01912 నంబర్లకు కాల్ చేయవచ్చు. లేదంటే 1912 హెల్ప్ లైన్ నంబర్ కాల్ చేసి కస్టమర్ సర్వీస్ ప్రతినిధిని సంప్రదించవచ్చు. వారి సూచనలను పాటించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.
ఇక తెలంగాణ విద్యుత్ శాఖ అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా ఏదయినా సమస్య ఉంటే ఫిర్యాదు చేయవచ్చు... వెంటనే పరిష్కారం పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా కూడా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఇవేవీ కాదంటే స్థానిక విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించవచ్చు.