
Hyderabad : హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతం ఏదంటే టక్కున బడాబాబులు నివాసముండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పేర్లు వినిపిస్తాయి. ఇటీవలకాలంలో శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి అక్కడకూడా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.. కాబట్టి ఏ కోకాపేట్, శంషాబాద్ పేర్లో వినిపిస్తాయి. ఐటీ ఇండస్ట్రీకి నగరం నిలయంగా మారిందికాబట్టి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల పేర్లో వినిపిస్తాయి.
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూముల ధరలు ఆకాశాన్నంటాయి… ఇప్పుడు ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు) పరిధిలోని ప్రాంతాల్లో భూములకు కూడా గిరాకీ పెరిగింది. ఇటీవల కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలాలు వేలంవేస్తే కోట్లకు అమ్ముడుపోయాయి. మియాపూర్, నానక్ రాం గూడ వంటి ప్రాంతాలు కూడా బాగా డెవలప్ అయ్యాయి. ఇలా హైదరాబాద్ లో బాగా డెవలప్ అయిన ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి.
అయితే ఏమాత్రం డెవలప్ మెంట్ కు నోచుకోని పాతబస్తీ ప్రాంతంలో ఈ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లను తలదన్నేలా భూముల ధరలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా?.. అవును మీరు వింటున్నది నిజమే. హైదరాబాద్ లో ఆర్థిక రాజధాని ముంబై స్థాయిలో భూముల ధరలు కలిగిన ప్రాంతం ఓల్డ్ సిటీలో ఉంది. అంత కాస్ట్లీ ప్రాంతం ఏది? అక్కడ భూమి ఎందుకంత ధర పలుకుతోంది? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలోనే కాదు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ దుకాణానికైనా వెళ్లండి... సరుకులు ఎక్కడినుండి తీసుకువస్తున్నారని అడిగితే ఎక్కువమంది చెప్పేది బేగంబజార్ పేరే. హైదరాబాద్ లో అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ ఈ బేగంబజార్.. ఇక్కడ గుండుపిన్ను దగ్గర్నుండి లక్షల విలువైన వస్తువుల వరకు ప్రతిఒక్కటి దొరుకుతుంది. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు... అందుకే నిత్యం వేలాదిమంది వ్యాపారులతో కిటకిటలాడుతూ కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది.
ఈ బేగం బజార్ లో రోజురోజుకు వ్యాపారాలు పెరుగుతున్నాయి... ఇప్పటికే ఇరుకు సందులు, చిన్నచిన్న వీధుల్లోనూ దుకాణాలు వెలిసాయి. నిజాంల కాలంనాటి పాత భవనాల్లోనే వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం మార్వాడీ, ఉత్తరాది వ్యాపారులకు నిలయం... వీరు నగరం ఎంత అభివృద్ధి చెందినా ఈ బేగంబజార్ ను విడిచి బయటకు రారు. కాబట్టి ఈ ప్రాంతంలో స్థలాలకు భారీ డిమాండ్ ఏర్పడింది.
బేగంబజార్ లో కొత్తగా వ్యాపారాలు ఏర్పాటుచేయాలంటే స్థలమే కరువయ్యింది... ఇరుకు సందుల్లోని ఆ పాత భవనాలనే కూల్చి కొత్త బిల్డింగ్ లు వెలుస్తున్నాయి. పాతబస్తీలో రోడ్లు కూడా సరిగ్గా లేని ఇరుకుసందుల్లోని ఈ స్థలాల కోసం వ్యాపారులు ఎగబడుతున్నారు. దీంతో బేగంబజార్ లో స్థలాల ధరలు హైదరాబాద్ స్థాయిలో కాదు ఏకంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై స్థాయికి చేరుకున్నాయి... గజం ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
బేగం బజార్ అంటే తెలియని వ్యాపారులు ఉండరు... అలా హైదరాబాద్ ఎంజిబిఎస్ బస్టాండ్ దగ్గర్నుండి ముందుకువెళుతూ ఉస్మానియా హాస్పిటల్ ను దాటితేచాలు ఇరుకుఇరుకు సందుల్లో కోట్ల వ్యాపారాలు జరుగుతుంటుంది. మనుషులు నడవడానికే కష్టమైన సందుల్లో వేలాదిగా వ్యాపార సముదాయాలు కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో హోల్ సేల్ బిజినెస్ కు అడ్డా అయిన ఈ ప్రాంతంలో భూముల ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందువరకు ఈ బేగంబజార్ లో హైదరాబాద్ లోని మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే గజం లక్ష రెండు లక్షల రూపాయలు ఉండేది. కానీ 2014 తర్వాత ఈ ప్రాంతంలో స్థలాలకు రెక్కలు వచ్చాయి.. తాజాగా ఈ ప్రాంతంలో ఎక్కడైనా గజం ధర రూ. 10 లక్షలు పలుకుతోంది. ఇక వ్యాపార సముదాయాలకు సమీపంలో అయితే ఏకంగా గజం రూ.20 లక్షలకు పైగా పలుకుతోంది. ఈ స్థాయి ధరలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కూడా లేవు.
పురాతన భవనాలను మార్వాడీ, ఉత్తరాది వ్యాపారులు భారీ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ స్థలంలో భారీ భవనాలు నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారు. ఇన్నికోట్లుపోసి స్థలాలు కొని వ్యాపారాలు చేస్తున్నారంటేనే బేగంబజార్ లో ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చే. ఇక్కడ చాలామంది వ్యాపారులు తమ గల్లాపెట్టెల్లోనే కోట్ల రూపాయలు పెట్టుకుంటారని... రాష్ట్ర బడ్జెట్ కు సరిపడా డబ్బులు ఈ ఒక్క బేగంబజార్ లోనే చూడవచ్చని ప్రచారంలో ఉంది.
సాధారణంగా స్థలాలను కొనుగోలుచేస్తే గజాల్లో ఉంటుంది... అదే వ్యాపార సముదాయాల్లో అయితే చదరపు అడుగులు (స్వేర్ ఫీట్) లో ఉంటాయి. ఇలా బేగంబజార్ చదరపు అడుగుకు రూ.70 వేలు పలుకుతోంది. హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకునే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో కూడా చదరపు అడుగు రూ.20 వేలకు మించదు. అలాంటిది ఓల్డ్ సిటీలోని బేగంబజార్ లో మాత్రం ఈ స్థాయిలో ధర పలుకుతోంది.
బేగంబజార్ లో రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా వ్యాపార సముదాయాలు వెలిసాయి. ఇక్కడ 5 వేలకుపైగా దుకాణాలు ఉంటాయని అంచనా... ఇక చిన్నాచితక, రోడ్లపై వ్యాపారాలకు లెక్కేలేదు. ఇక్కడికి నిత్యం వేలాదిమంది సరుకుల కోసం వస్తుంటారు.. అలాగే కేవలం ఫోన్లలోనే కోట్లాది రూపాయల వ్యాపారాలు జరుగుతాయి. రోజంతా ప్రజలతో కిటకిటలాడే బేగంబజార్ వీధులు రాత్రి అయిందంటే చాలు లారీలు, ట్రాలీ ఆటోలు, ఇతర సరుకు రవాణా వాహనాలతో నిండిపోతాయి. రాష్ట్ర నలుమూలలకు ఇక్కడి నుండి సరుకులు వెళుతుంటాయి.
ఇలా వ్యాపార సముదాయాలకు నిలయం కాబట్టే బేగంబజార్ లో రియల్ ఎస్టేట్ ఈ స్థాయిలో ఉంది. రాష్ట్రం మొత్తం ప్రస్తుతం భూముల ధరలు పడిపోయాయి... రియల్ ఎస్టేట్ డల్ అయ్యింది... కానీ బేగంబజార్ లో కాదు. ఇక్కడ ఇప్పుడు స్థలం అమ్మకానికి పెట్టినా కోట్లు పోసి కొనేవాళ్లు రెడీగా ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని స్థలాలకు వేలంపాటలో అమ్మారంటేనే ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థమవుతుంది.