Petrol: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, నగరంలో పెట్రోల్ సరఫరాపై వస్తున్న వార్తలు కలిసి గందరగోళ పరిస్థితి తీసుకొచ్చాయి. కొన్నిచోట్ల పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడటం, మరికొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులతో గందరగోళం నెలకొంది.
హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద అసాధారణ రద్దీ కనిపిస్తోంది. కూకట్‌పల్లి, అమీర్‌పేట, సనత్‌నగర్, బేగంపేట, ఖైరతాబాద్, అబిడ్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో వాహనదారులు పెద్ద సంఖ్యలో బంకుల వద్ద నిలబడ్డారు. కొన్ని బంకుల వద్ద గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల స్టాక్ త్వరగా అయిపోవడంతో బంకులు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. దీంతో తెరిచి ఉన్న బంకుల వద్ద మరింత రద్దీ పెరుగుతోంది. ఈ పరిస్థితి నగర ట్రాఫిక్‌పై కూడా ప్రభావం చూపుతోంది.
25
పుకార్లతో పెరిగిన ఆందోళన
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రజల్లో భయం పెరిగి పెద్ద ఎత్తున బంకుల వద్దకు వెళ్లడం ప్రారంభమైంది. మెదక్, కరీంనగర్, సిద్ధిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అధికారులు మాత్రం ఇంధన కొరత లేదని, ప్రజలు వదంతులను నమ్మవద్దని స్పష్టం చేస్తున్నారు. సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని చెబుతున్నారు.
35
అసలు సమస్య ఏమిటి?
నిపుణుల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఏర్పడిన సమస్యకు యుద్ధ పరిస్థితులతో పెద్దగా సంబంధం లేదని తెలుస్తోంది. ప్రధాన కారణం ఆయిల్ కంపెనీలతో పాటు పెట్రోల్ బంకు యజమానుల మధ్య తలెత్తిన ఆర్థిక వివాదం. గతంలో ఆయిల్ కంపెనీలు బంకు యజమానులకు క్రెడిట్ సౌకర్యం కల్పించేవి. అంటే ముందుగా ఇంధనం సరఫరా చేసి తరువాత చెల్లింపులు తీసుకునే విధానం ఉండేది. కానీ ఇటీవల ఆయిల్ కంపెనీలు ఈ విధానాన్ని నిలిపివేసి ముందుగానే డబ్బులు చెల్లించాలని కొత్త నిబంధన పెట్టాయి. ఇప్పటికే ఉన్న బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని చెప్పడంతో కొంతమంది బంకు యజమానులు కొత్త స్టాక్ తెప్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల కొన్ని బంకులు తాత్కాలికంగా మూతపడుతున్నాయి.
పెట్రోల్ బంకుల వద్ద పెరుగుతున్న రద్దీ ట్రాఫిక్ సమస్యలను కూడా పెంచుతోంది. రోడ్లపై వాహనాలు వరుసగా నిలబడటంతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలంటే ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ త్వరగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు, బంకు యజమానుల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించాలి. అదనపు ఇంధన సరఫరా అందించే చర్యలు తీసుకుంటే పరిస్థితి త్వరగా మెరుగుపడే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.
55
ఆర్టీసీ నుంచి ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో నడిచే మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సొంత వాహనాలతో పెట్రోల్ కోసం గంటల పాటు వేచి ఉండటం కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మంచిదని ఆయన సూచించారు. ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగిస్తే ఇంధనం ఆదా అవుతుందని, ట్రాఫిక్ కూడా తగ్గుతుందని తెలిపారు.