Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనుల శ్రీకారం చుట్టారు. కాగా ఈ సందర్భంగా పవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా నాచుపల్లి జేఎన్టీయూ హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయనకు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం తెలిపారు. అనంతరం అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
25
‘కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది’ అంటూ భావోద్వేగం
దర్శనం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. కొండగట్టు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థలమని చెప్పారు. ఒక సందర్భంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. ఈ క్షేత్రం తనకు పునర్జన్మ ఇచ్చిందని అన్నారు. అంజన్నపై తనకు అపారమైన భక్తి ఉందని, అందుకే ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకోవడం తనకు ఎంతో ముఖ్యమని తెలిపారు.
35
పవన్ కళ్యాణ్‌కు జరిగిన ప్రమాదం.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ క్షణాలు
సుమారు రెండు దశాబ్దాల క్రితం ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న వాహనానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి తీవ్రమైన ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడటం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ప్రమాద ప్రాంతం కొండగట్టుకు సమీపంలో ఉండటంతో.. అంజన్న కృప వల్లే తనకు ప్రాణదానం లభించిందని పవన్ కళ్యాణ్ నమ్మకం. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి ఆయన జీవితంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది.
భక్తుల సౌకర్యాల కోసం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన రూ. 35.19 కోట్ల నిధులతో కొండగట్టులో 96 గదుల ధర్మశాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. దీక్ష చేపట్టే భక్తుల కోసం ప్రత్యేక దీక్షా విరమణ మండపం కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ వాస్తు నిపుణుడు ఆనంద్ సాయి ఈ పనులను పర్యవేక్షించనున్నారు.
55
జనసేన కార్యకర్తలతో సమావేశం..
అంజన్న దర్శనం తర్వాత పవన్ కళ్యాణ్ నాచుపల్లి శివారులోని ఒక రిసార్ట్‌లో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయగా.. ఆయనను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.