Nirmala sitharaman: సాధారణంగా ఇళ్ల ముందు ఎవరైనా తమ పేరు రాసుకుంటారు. కానీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్‌లోని ఇంటి ముందు సంస్కృత పదాలు ఉన్నాయి. దీంతో వీటి అర్థం ఏంటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇంటి గోడపై ఒకవైపు రాసి ఉన్న “ఈశావాస్యమ్” అనే పదం సంస్కృతంలోని “ఈశావాస్య” అనే పదం నుంచి వచ్చింది. దీని సరళమైన అర్థం “ఈ సమస్త ప్రపంచం ఈశ్వరుడితో నిండి ఉంది” అని. అంటే మన చుట్టూ ఉన్న సృష్టిలో ప్రతి చోటా దైవత్వాన్ని చూడాలనే భావన ఇందులో ఉంది. మనుషులు, జంతువులు, చెట్లు, ప్రకృతి, నీరు, గాలి ఇలా కనిపించే ప్రతి దానిలోనూ భగవంతుడి ఉనికి ఉందని భావించాలి. అందువల్ల ఏ జీవిని తక్కువగా చూడకూడదు. ప్రకృతిని నాశనం చేయకూడదు. ఇతరుల పట్ల గౌరవంతో వ్యవహరించాలి.
25
“ఈశావాస్యమిదం సర్వం” అంటే ఏమిటి?
ఇంటి ముందు రాసి ఉన్న పూర్తి మంత్రం. “ఈశావాస్యమిదం సర్వం యత్ కించ జగత్యాం జగత్. తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్యస్విద్ధనం ॥” ఇది ఈశావాస్య ఉపనిషత్తులోని మొదటి మంత్రం. ఇందులోని మొదటి మాటలే “ఈశావాస్యమిదం సర్వం”. అంటే “ఈ సమస్త ప్రపంచం ఈశ్వరుడితో నిండి ఉంది” అని అర్థం. ఈ ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి జీవి, ప్రతి వస్తువు దైవసృష్టిలో భాగమే అని ఈ మంత్రం చెబుతోంది. అందుకే మనిషి తనకు ఉన్న సంపద, అధికారం, సౌకర్యాలను మాత్రమే చూసుకోకుండా.. తన చుట్టూ ఉన్న సమాజం, ప్రకృతి, ఇతర జీవుల పట్ల కూడా బాధ్యతగా ఉండాలని ఈ భావన గుర్తు చేస్తుంది.
35
“తేన త్యక్తేన భుంజీథా”.. అర్థం ఏంటంటే.?
ఈ మంత్రంలోని మరో ముఖ్యమైన మాట “తేన త్యక్తేన భుంజీథా”. సాధారణంగా దీన్ని “త్యాగ భావంతో అనుభవించు” అని అర్థం చేసుకోవచ్చు. మనకు జీవితంలో ఇల్లు, డబ్బు, ఆస్తి, ఉద్యోగం, పదవి, ఇతర సౌకర్యాలు లభిస్తాయి. వాటిని అనుభవించకూడదని ఈ మంత్రం చెప్పడం లేదు. అయితే అవే శాశ్వతంగా మనవే అనే భావనతో వాటిపై విపరీతమైన మమకారం పెంచుకోకూడదని చెబుతోంది. మనకు లభించిన దాన్ని సంతోషంగా ఉపయోగించుకోవాలి. అవసరానికి మించి స్వార్థంతో కూడబెట్టకూడదు. మన దగ్గర ఉన్నది ఇతరులకు కూడా ఉపయోగపడేలా చూసే మనస్తత్వం ఉండాలి. ఇదే ఈ భాగం ఇచ్చే ప్రధాన సందేశం.
“మా గృధః కస్యస్విద్ధనం”.. ఇతరుల సొమ్ముపై ఆశపడొద్దు
ఈ శ్లోకంలోని చివరి భాగం “మా గృధః కస్యస్విద్ధనం”. దీని అర్థం “ఇతరులకు చెందిన ధనంపై ఆశపడవద్దు” అని. మనిషికి ఎంత ఉన్నా ఇంకా ఎక్కువ కావాలనే కోరిక రావచ్చు. ఇతరుల దగ్గర ఉన్న ఆస్తి, డబ్బు, సౌకర్యాలను చూసి వాటిని పొందాలనే ఆశ కలగవచ్చు. కానీ అత్యాశ మనిషిని తప్పు మార్గంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకే ఎవరి సంపద వారిదే అని గౌరవిస్తూ.. మనకు లభించిన దానితో సంతృప్తిగా, నిజాయితీగా జీవించాలని ఈ మంత్రం చెబుతోంది. ఇతరుల హక్కులను గౌరవించడం కూడా ఇందులోని ముఖ్యమైన సందేశమే.
55
“ఈశావాస్యం” మొత్తం చెప్పే జీవన సందేశం ఇదే
“ఈశావాస్యం” అనే ఒక్క పదంలోనే ఈ మంత్రం మొత్తం భావం దాగి ఉంది. ప్రపంచంలోని ప్రతి దానిలో దైవత్వాన్ని చూడాలి. మనకు లభించిన వాటిని బాధ్యతగా ఉపయోగించాలి. వాటిపై అతిగా మమకారం పెంచుకోకూడదు. ఇతరుల సంపదను ఆశించకూడదు. అంటే ఈ శ్లోకం కేవలం ఆధ్యాత్మిక సందేశం మాత్రమే కాదు.. రోజువారీ జీవితానికి కూడా వర్తించే విలువలను చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. “అంతటా దైవాన్ని చూడు.. నీకు లభించిన దానితో సంతృప్తిగా ఉండు.. దాన్ని సద్వినియోగం చేసుకో.. ఇతరుల సొమ్ముపై ఆశపడకు..” అనేదే ఈశావాస్య మంత్రం ఇచ్చే ప్రధాన సందేశం.