Hyderabad: హైదరాబాద్ అంతర్జాతీయ విద్యా కేంద్రంగా మరింత వేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే పలు విదేశీ విద్యా సంస్థలు నగరంలో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుండగా.. తాజాగా అమెరికాకు చెందిన ప్రభుత్వ విశ్వవిద్యాలయం కూడా హైదరాబాద్‌ను ఎంచుకుంది.
అమెరికా ప్రభుత్వానికి చెందిన కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ (సీయూ డెన్వర్) భారత్‌లో తన తొలి విదేశీ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) అందుకుంది. దీంతో భారత్‌లో క్యాంపస్ ఏర్పాటుకు యూజీసీ నుంచి అనుమతి పొందిన తొలి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా సీయూ డెన్వర్ గుర్తింపు పొందింది.
25
2027 ఆగస్టు నుంచి తరగతులు
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న క్యాంపస్‌లో 2027 ఆగస్టు నుంచి విద్యా కార్యక్రమాలను ప్రారంభించే దిశగా సీయూ డెన్వర్ ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి బోధన అందించడంతోపాటు.. చదువు పూర్తయిన తర్వాత మారుతున్న ఉద్యోగ విపణిలో అవకాశాలు అందిపుచ్చుకునేలా అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. విద్యా ప్రమాణాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది.
35
డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రాధాన్యం
ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగ విపణిలో మంచి అవకాశాలు ఉన్న రంగాలను సీయూ డెన్వర్ ప్రధానంగా ఎంచుకోనుంది. బిజినెస్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్, అనలిటిక్స్ తదితర విభాగాల్లో కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అంతర్జాతీయ విద్యా విధానాన్ని భారతీయ అవసరాలకు అనుగుణంగా మలచడం ద్వారా విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ క్యాంపస్ పనిచేయనుంది. భారతీయ విద్యార్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని హైదరాబాద్ కేంద్రంగా మరింత విస్తరించేందుకు అవకాశం లభించిందని సీయూ డెన్వర్ ఛాన్సలర్ కెన్నెత్ క్రిస్టెన్సెన్ తెలిపారు.
భారత్‌లో సీయూ డెన్వర్ కార్యకలాపాలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ఎమెరిటస్ వ్యూహాత్మక జాయింట్ వెంచర్ భాగస్వామిగా వ్యవహరించనుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యా రంగంలో మారుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారతీయ విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ విద్యను అందించడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా ఉంటుందని ఎమెరిటస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అశ్విన్ దామెరా పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ విశ్వవిద్యాలయ విద్యను పొందేందుకు విద్యార్థులకు ఇది మరో మార్గాన్ని అందించే అవకాశం ఉంది.
55
భారత్‌లో విదేశీ వర్సిటీలకు హైదరాబాద్ కీలక కేంద్రం
యూజీసీ వివరాల ప్రకారం ప్రస్తుతం భారత్‌లో ఎనిమిది విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌ల ఏర్పాటుకు పూర్తిస్థాయి అనుమతులు పొందాయి. వాటిలో నాలుగు ఇప్పటికే విద్యా కార్యక్రమాలను ప్రారంభించాయి. పూర్తిస్థాయి అనుమతులు పొందిన క్యాంపస్‌లలో నాలుగు మహారాష్ట్రలో ఉండగా.. కర్ణాటక, హరియాణాలో రెండేసి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ అనుమతులు పొందిన సంస్థలు యూకే, ఆస్ట్రేలియాకు చెందినవే. మరో 11 విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రాథమిక అనుమతులు పొందాయి. ఇదే సమయంలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ లండన్, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయాలతోపాటు మరో నాలుగు అంతర్జాతీయ విద్యా సంస్థలను తీసుకురానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిణామాలతో హైదరాబాద్ దేశంలోనే విదేశీ విశ్వవిద్యాలయాలకు ముఖ్యమైన విద్యా గమ్యస్థానంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.