Musi Floods : మూసీ ఉగ్రరూపం... ప్రస్తుతం ఈ నదిలో ఎన్నివేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందో తెలుసా?

Published : Sep 27, 2025, 11:23 AM IST

Musi Floods : మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం ఈ నది వేల క్యూసెక్కుల వరదనీటితో చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంతాలను వరదనీరు ముంచెత్తుతోంది. 

PREV
16
మూసీనది ఉగ్రరూపం

Musi Flood : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వరద నీటితో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఇప్పుడు రాజధాని నగరం నడిబొడ్డున ఇలాంటి పరిస్థితే నెలకొంది... భారీ వర్షాలతో వరదనీరు చేరడంతో మూసీ నది ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాలకు వరదనీరు చేరుకుని ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ భారీ వర్షాలు కురిస్తే మూసీ మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలున్నాయి. దీంతో నగరంలో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.

26
ఎంజిబిఎస్ బస్టాండ్ మునక

మూసీ ప్రవాహం మహత్మగాంధీ బస్టాండ్ (MGBS) ని చుట్టుముట్టింది. ఒక్కసారిగా వరదనీరు బస్టాండ్ లోకి చేరుకోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ప్రయాణికులు బయటికి వచ్చారు. అయితే ప్రస్తుతం ఎంజిబిఎస్ ను వరదనీరు చుట్టుముట్టడంతో జిల్లాల నుండి వచ్చే బస్సులను అనుమతించడంలేదు... ఎక్కడిక్కడ దారి మళ్లిస్తున్నారు.

36
వంతెనలపైనుండి మూసీ ప్రవాహం

ఇక మూసీ నదిపై గల పలు వంతెనపైనుండి వరదనీరు ప్రవహిస్తోంది. పూరానాపూల్ బ్రిడ్జి వద్ద మూసీ ప్రమాదకర స్థాయికి చేరింది… దీంతో నదీపరివాహక ప్రాంతంలోని ఓ శివాలయం నీటమునిగింది. ఆ ఆలయ పూజారి కుటుంబం ఆ నీటిలోని చిక్కుకుపోయారు... ఆలయంపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నవారు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని సురక్షితంగా కాపాడేందుకు హైడ్రా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇక మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో వీటిని మూసివేశారు. మూసీ నదితో పాటు నాలాల్లో కూడా ప్రవాహ ఉద్ధృతి పెరిగింది... దీంతో కొన్ని కాలనీలు నీటమునిగాయి. ఇలా నీటమునిగిన కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

46
మూసీ వరదలకు కారణమిదే

మూసీ నదిలో హటాత్తుగా ప్రవాహ ఉద్ధృతి పెరగడానికి జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీగా నీటి దిగువకు వదలడమే కారణంగా తెలుస్తోంది. గండిపేట (ఉస్మాన్ సాగర్) జలాశయం గేట్లు ఎత్తడంవల్లే మూసీలో నీటిప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. దీనిపై ప్రజలకు ముందస్తు సమాచారం ఇచ్చివుంటే జాగ్రత్త పడేవారని... అలాంటి హెచ్చరికలేవీ లేకుండానే గేట్లు ఎత్తడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కూడా మూసీ వరదలకు కారణం అవుతున్నాయి. ప్రస్తుతం జంట జలాశయాల నుండి 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీనికి తోడు పరివాహక జిల్లాలు, నగరంలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో మూసీ ప్రవాహం మరింత ప్రమాదకరంగా మారింది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మూసీకి వరద ప్రవాహం పెరిగే అవకాశాలున్నాయి... కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.

56
మూసీ వరదలు.. అధికారులకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్ నగరం మధ్యలోంచి ప్రవహించే మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మూసీ నదిలో వరదనీటి ప్రవాహం, పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నది ఇరువైపుల లోతట్టు ప్రాంతాలన్నింటా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని... ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో చేపడతున్న సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్​లో మాట్లాడుతూ తగిన సూచనలు చేస్తున్నారు.. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్​కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగలు దగ్గరపడటం, వీకెండ్ కావడంతో జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఎంజిబిఎస్ కు ఎక్కువగా వస్తుంటారు.. కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఇక ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసి, విద్యుత్ తో పాటు ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతాలు, బ్రిడ్జిల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉంటే హెచ్చరిక బోర్డులు పెట్టడం, ఫోన్లకు మెసేజ్ లు పంపడం, ఇతర మార్గాల్లో పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

66
ఎంజిబిఎస్ మూసివేత... జిల్లాల బస్సులు ఇక్కడినుండే నడిచేది

మూసీ న‌దికి భారీ వ‌ర‌ద నేప‌థ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగ‌ణంలోకి వ‌ర‌ద నీరు చేరడంతో బస్సులను దారిమళ్ళించినట్లు... ఈ బస్టాండ్ కు రాక‌పోక‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఎంబీజీఎస్ నుంచి బ‌య‌లుదేరే బ‌స్సుల‌ను హైద‌రాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి న‌డుపనున్నట్లు తెలిపింది... ఏ ప్రాంతం నుండి ఏ జిల్లాలకు బస్సులు నడుస్తాయో ఎక్స్ వేదికన ప్రకటించింది తెలంగాణ ఆర్టిసి.

1. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే స‌ర్వీసులు జేబీఎస్ నుంచి న‌డుస్తున్నాయి.

2. వరంగల్, హన్మకొండ వైపున‌కు వెళ్లేవి ఉప్ప‌ల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి.

3. సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ, విజ‌య‌వాడ వైపున‌కు బ‌స్సులు ఎల్బీన‌గ‌ర్ నుంచి న‌డుస్తున్నాయి.

4. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, క‌ర్నూల్, బెంగ‌ళూరు వైపున‌కు వెళ్లే స‌ర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.

మూసీ వ‌ర‌ద‌నీరు చేరిన నేప‌థ్యంలో ఎంజీబీఎస్ కు ప్ర‌యాణికులు ఎవ‌రూ రావొద్ద‌ని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞ‌ప్తి చేస్తోంది. ఎంబీజీఎస్ నుంచి న‌డిచే బ‌స్సుల‌ను ఇత‌ర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామ‌ని, ఆయా మార్గాల ద్వారా త‌మ గమ్య‌స్థానాల‌కు చేరుకోవాల‌ని పేర్కొంది. వివ‌రాల‌కు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-69440000, 040-23450033 సంప్ర‌దించాల‌ని సూచించింది.

Read more Photos on
click me!

Recommended Stories