
Telangana Cabinet Expansion : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.. చివరకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కూడా కారణమయ్యింది. ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ఎత్తుగడే మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దిన్ కు మంత్రి పదవి అంటూ రాజకీయ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది. తాజాగా రాజ్ భవన్ లో అజారుద్దిన్ తో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ... ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన అజారుద్దిన్ కు సీఎంతో పాటు సహచర మంత్రులు, నాయకులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటివరకు ముస్లిం సామాజికవర్గానికి చోటు లేదు... కానీ అజారుద్దిన్ చేరికతో ఆ లోటు తీరిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరికోరి మరీ అజారుద్దిన్ కు తన కేబినెట్ లోకి తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది... ఇదే నిజమైతే ఆయనకు కీలకమైన శాఖ దక్కే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోం, విద్యా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆండ్ పట్టణాభివృద్ధి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి శాఖలు ఉన్నాయి. ఇందులో ఏది అజారుద్దిన్ కు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కేసీఆర్ కేబినెట్ లో మాదిరిగానే కీలకమైన హోంశాఖను ముస్లిం మైనారిటీ నాయకుడికి అప్పగించాలనే ఆలోచనలో రేవంత్ ఏమైనా ఉన్నారా? అందుకే అజారుద్దిన్ ను కేబినెట్ లోకి తీసుకున్నారా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
అజారుద్దిన్ కు హెంశాఖను కేటాయించే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ శాఖను సీనియర్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటివారు ఆశిస్తున్నారనే ప్రచారముంది... అలాంటిది వీరిని కాదని కొత్తగా మంత్రివర్గంలో చేరిన అజారుద్దిన్ కు ఇచ్చే అవకాశాలు తక్కువే. ఒకవేళ సీఎం ధైర్యంచేసి అజారుద్దిన్ కు హోంశాఖను ఇస్తే అది రాజకీయ సంచలనమే అని చెప్పాలి.
మరోవైపు క్రీడలపై కూడా రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది... రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో క్రీడల్లో మంచి అనుభవం ఉన్నటీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దిన్ కు స్పోర్ట్స్ మినిస్ట్రీ అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
అజారుద్దిన్ ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు... కాబట్టి ఆయనకు అదే శాఖ కేటాయిస్తారనది మరో ప్రచారం. ఇలా తాజాగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దిన్ కు హోం, క్రీడా, మైనారిటీ శాఖలలో ఏదోఒకటి దక్కుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది.. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
అజారుద్దిన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నా అప్పుడే ఏ శాఖను కేటాయించబోరని... జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో కీలక మార్పులుచేర్పులు ఉంటాయనే చర్చ సాగుతోంది. తనవద్ద ఉన్న శాఖలను మంత్రులకు కేటాయించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట... ముఖ్యంగా పూర్తిస్థాయిలో హోం, విద్యాశాఖలకు మంత్రులను కేటాయించాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.
ఇదే జరిగితే సీనియర్ మంత్రులకు ఈ శాఖలు దక్కే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అజారుద్దిన్ కు ఏ శాఖ దక్కే అవకాశముందనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా అజారుద్దిన్ తెలంగాణ కేబినెట్ లోకి చేరినా ఏ బాధ్యతలు అప్పగిస్తారన్నది సస్పెన్స్ గా మారింది.
మహ్మద్ అజారుద్దిన్ పక్కా హైదరాబాదీ... ఆయన బాల్యమంతా నగరంలోనే సాగింది. అబిడ్స్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది... తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఈ సమయంలోనే ఆయనకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పరిచయం ఏర్నడింది. ఈ స్కూల్లో చదివే సమయంలోనే క్రికెట్ పై మక్కువ పెంచుకున్నారు. మేనమామ జైనులాబుద్దిన్ అతడి ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు.
నిజాం కాలేజీతో ఉన్నత విద్యాభ్యాసం చేశారు అజారుద్దిన్. ఈ సమయంలోనే క్రికెట్ ను ప్రొఫెషన్ గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో చదువును పక్కనబెట్టి పూర్తిగా క్రికెట్ పై ఫోకస్ పెట్టారు... అంచెలంచెలుగా ఎదిగి 1984 లో అంతర్జాతీయ క్రికెటర్ గా మారారు. చివరకు టీమిండియా కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు. దాదాపు పదహారేళ్లపాటు క్రికెటర్ గా రాణించిన అజారుద్దిన్ 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు.
క్రికెటర్ గా రిటైర్ అయ్యాక రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు... 2009 లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉత్తర ప్రదేశ్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత అనేక కీలక పదవులు పొందారు... 2018 లో తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఆసక్తికర విషయం ఏంటంటే కనీసం ఒక్కసారికూడా ఎమ్మెల్యేగా ఎన్నికవకుండానే నేరుగా మంత్రిగా మారారు మహ్మద్ అజారుద్దిన్.