
తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవం మేడారం జాతరకు రంగం సిద్ధమవుతోంది. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026 సంవత్సరానికి సంబంధించిన తేదీలు అధికారికంగా ప్రకటించారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరిగే ఈ మహా జాతర జనవరి 28 నుండి 31 వరకు నిర్వహించనున్నారు. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా దీనికి గుర్తింపు ఉంది.
ప్రజలు లక్షల సంఖ్యలో తరలివచ్చే ఈ పండుగకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టనుంది. ఈ సందర్భంగా రవాణా, పారిశుధ్యం, తాగునీరు, ఆరోగ్య సౌకర్యాలు, భద్రత తదితర విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మేడారం జాతర అధికారిక తేదీల ప్రకారం జనవరి 28 , 2026 (బుధవారం): శ్రీ సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు చిలకలగుట్ట నుండి ఘట్టం వద్దకు చేరుకుంటారు. అంటే గద్దెల మీదకు వస్తారు.
ఆ తర్వాతి రోజు అంటే జనవరి 29, 2026 (గురువారం) శ్రీ సమ్మక్క తల్లి ఘట్టం వద్దకు చిలకలగుట్ట నుండి గద్దెల మీదకు వస్తుంటారు. ఈ రెండు రోజులు భక్తులు భక్తిశ్రద్ధలతో వనదేవతలు పూజిస్తారు. ఈ సమయాన్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు.
జనవరి 30 (శుక్రవారం) రోజున భక్తులు తమ మొక్కులు చెల్లించేందుకు ఘట్టానికి విచ్చేస్తారు. వారు బెల్లం, కంకణాలు, పసుపు, కుంకుమ, ఎర్రబట్టలు వంటి సంప్రదాయ వస్తువులతో పూజలు నిర్వహిస్తారు. ఈ బెల్లాన్ని ‘బంగారం’గా పరిగణించి దేవతలకు సమర్పిస్తారు.
జనవరి 31 (శనివారం)న సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల వనప్రవేశం జరగనుంది. ఇది దేవతల అడవిలోకి తిరిగి వెళ్ళడాన్ని సూచిస్తుంది. దీంతో మేడారం జాతర ముగుస్తుంది.
సమ్మక్క-సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ఒక గిరిజన మాతృక పండుగగా విశేషంగా గుర్తింపు పొందింది. సమ్మక్క, సారలమ్మ అనే తల్లి-కూతుళ్లు పాలకుల అన్యాయ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనితల పోరాటాన్ని గుర్తుచేస్తాయి. వీరి త్యాగం గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.
ఈ జాతరలో 2012లో దాదాపు 10 మిలియన్ల మంది భక్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత సంవత్సరాల నుంచి మేడారం జాతరకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చివరగా జరిగిన జాతరకు 15 మిలియన్ల మందికి పైగా వచ్చారు.
కుంభమేళా తర్వాత దేశంలోనే అతిపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న జాతరగా నిలిచింది. తెలంగాణ లోని వారు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
జంపన్న వాగు గోదావరి నదికి ఉపనది. ఇది సమ్మక్క కొడుకు జంపన్న యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ వాగు ఎరుపు రంగులో కనిపిస్తుంది.. శాస్త్రీయంగా ఇది నేలలోని ఖనిజాల వలన కలిగే రంగు అయినప్పటికీ, గిరిజనులు దీన్ని జంపన్న రక్తంగా పరిగణించి పవిత్రంగా భావిస్తారు. భక్తులు ఈ వాగులో స్నానం చేస్తూ తమకు ధైర్యం ప్రసాదించమని దేవతలను ప్రార్థిస్తారు.
చరిత్ర ప్రకారం, 13వ శతాబ్దంలో ఒక గిరిజన గుంపు వేటకు వెళ్లగా.. చిలకలగుట్టలో ఒక శిశువును పులులతో ఆడుకుంటుండగా చూస్తారు. ఆమె సమ్మక్క. ఆమెను గిరిజన నాయకుడు దత్తత తీసుకుంటారు.
తర్వాతి కాలంలో ఆమె ఆ ప్రాంతానికి నాయకురాలిగా ఎదుగుతుంది. ఆమెకు పగిడిద్దరాజుతో వివాహం జరుతుంది. వీరి సంతానం సారక్క, నాగులమ్మ, జంపన్న. ఈ కుటుంబం గిరిజనులను రక్షించేందుకు అన్యాయ పాలకులపై పోరాడింది.
తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం మహా జాతర 2026 కోసం ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.