
Kurnool Bus Accident : శుక్రవారం తెల్లవారుజామున ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు… ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు పోలీసులు నిర్దారించారు. బస్సులోని మరికొందరు ప్రయాణికుల ఆఛూకీ లేదు.. కాబట్టి వారుకూడా మరణించి ఉంటారని భావిస్తున్నారు. బస్సు మంటల్లో చిక్కుకోగానే అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు ప్రాణాలతో బైటపడ్డారు.
అయితే ఈ బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్-బెంగళూరు హైవేపై అతివేగంతో వెళుతున్న బస్సు బైక్ ను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా ప్రమాదానికి గురైన బస్సుపై అనేక ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లో నమోదైన ట్రాఫిక్ ఉళ్లంఘనలను చూసినవారు బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం, యాజమాన్యానికి చూసిచూడనట్లు వ్యవహరించిన తీరే ఇప్పుడు ఇంతమందిని బలితీసుకున్నాయంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
హైదరాబాద్-బెంగళూరు మధ్య నడిచే వేమూరి కావేరీ సంస్థకు చెందిన బస్సు ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించేదికాదని జరిమానాలను బట్టి అర్థమవుతోంది. ఒకటిరెండు సార్లు అయితే పొరపాటున తప్పు చేశారని అనుకోవచ్చు... కానీ ఒక్క హైదరాబాద్ లోనే ఏకంగా 16 ట్రాఫిక్ ఉళ్లంఘనలకు పాల్పడ్డారు ప్రమాదానికి గురయిన బస్సు డ్రైవర్లు, సిబ్బంది. ఇందులో ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ జరిమానాలు కూడా ఉన్నాయి.
ఈ నెల (అక్టోబర్ 09న) కూడా హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలో ప్రమాదానికి గురయిన బస్సు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసింది... దీంతో ఫైన్ పడింది. ఇలా 2024 నుండి ఇప్పటివరకు అంటే దాదాపు రెండేళ్లలో ఈ బస్సు హైదరాబాద్ లో 16 సార్లు ట్రాఫిక్ ఉళ్లంఘనలకు పాల్పడింది... ప్రతిసారి వెయ్యి రూపాయలకు పైనే జరిమానాలున్నాయి. తాజాగా ప్రయాణికుల ప్రాణాలను బలితీసుకున్న DD01N9490 బస్సుపై ఏకంగా 23,120 ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయి.
మంటల్లో చిక్కుకుని అమాయక ప్రయాణికుల ప్రాణాలు బలితీసుకున్న వేమూరీ కావేరీ ట్రావెల్ బస్సు అడుగడుగునా ఉళ్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఈ బస్సును రిజిస్ట్రేషన్ చేసి తెలుగు రాష్ట్రాల మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరు నడుపుతున్నారు. దీని ఫిట్ నెస్, పర్మిట్ అను అనుమతులు కూడా రిజిస్ట్రేషన్ జరిగిన రాష్ట్ర పరిధిలోకే వస్తాయని తెలంగాణ రవాణ శాఖ వెళ్లడించింది.
అనుమతులు లేకుండా నడిపై బస్సుల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలంగాణ రవాణమంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రవాణా శాఖ తనిఖీలు చేపడితే ట్రావెల్స్ నిర్వహకులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు... చేయకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇకపై కర్నూల్ బస్సు ప్రమాదం మాదిరి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని... ఇందుకోసం తెలంగాణ, ఏపీ, కర్ణాటక రవాణ కమీషనర్ల సమావేశం ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కర్నూల్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన పీఎం క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడినవారి వైద్య ఖర్చుల కోసం రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ బస్సు ప్రమాదంలో మరణించినవారికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. తీవ్రంగా గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించనున్నట్లు ప్రకటించింది.
కర్నూల్ బస్సు ప్రమాద బాధితులు ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేసింది.
కర్నూలు కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ : 08518-277305
కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ : 9121101059
ప్రమాదం జరిగిన ప్రాంతంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ : 9121101061
కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూం : 9121101075,
కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో సహాయం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు : 9494609814, 9052951010