ఐఏఎస్ రిజ్వీ రిటైర్మెంట్‌పై అనుమానాలు.. సంచలనం సృష్టిస్తోన్న మంత్రి జూపల్లి లేఖ

Published : Oct 23, 2025, 06:50 PM IST

Minister Jupally: తెలంగాణ అబ్కారీ శాఖలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరికిరణ్‌లు తన ఆదేశాలను విస్మరించారని మంత్రి సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.

PREV
15
తెలంగాణ అబ్కారీ శాఖలో అంతర్గత విభేదాలు

తెలంగాణ అబ్కారీ శాఖలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ హరికిరణ్‌ల మధ్య సఖ్యత లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి ఇచ్చిన ఆదేశాలను ఈ ఇద్దరు ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారని ఆరోపిస్తూ జూపల్లి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. దానిని ఆమోదించవద్దని కోరుతూ మంత్రి జూపల్లి మరో లేఖ రాయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

25
రిజ్వీపై తీవ్ర ఆరోపణలు

మంత్రి జూపల్లి తన లేఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు. రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని, రాజ్యాంగబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. మంత్రిగా తన విధుల నిర్వహణకు అడ్డంకులు సృష్టించారని, అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని, వీఆర్ఎస్‌ను ఆమోదించవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. గత రెండు సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖలో రిజ్వీ తీసుకున్న నిర్ణయాల వెనుక అవకతవకలున్నాయని, దీనివల్ల శాఖకు తీరని నష్టం వాటిల్లిందని జూపల్లి స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలపై రిజ్వీ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

35
హోలోగ్రామ్ లేబుళ్ల సరఫరా కాంట్రాక్టుతో..

అసలు వివాదం మద్యం బాటిళ్లపై వేసే హోలోగ్రామ్ లేబుళ్ల సరఫరా కాంట్రాక్టుతో మొదలైంది. గత 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి ఈ కాంట్రాక్టును ఇస్తున్నారని, కొత్త టెక్నాలజీతో కూడిన మరింత సెక్యూర్డ్ లేబుల్స్ కోసం కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించినా, రిజ్వీ పాతవారికే అవకాశం కల్పించారని ఆరోపణలున్నాయి. బకాయిలు, కాంపౌండింగ్ ఫీజును పునఃపరిశీలించాలని మంత్రి ఆదేశించినా, ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదన్నది జూపల్లి వెర్షన్. చట్టవిరుద్ధంగా జిమిడేస్ ఛార్జీలు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సంబంధిత రికార్డులు అందజేయాలని కోరినా, నివేదికల పేరుతో రిజ్వీ జాప్యం చేశారని మంత్రి పేర్కొన్నారు.

45
ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్‌పైనా ఆరోపణలు

ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్‌పైనా మంత్రి జూపల్లి ఆరోపణలు చేశారు. బార్ అసోసియేషన్, ఏ-ఫోర్ దుకాణాల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని మంత్రి కోరినా ఇంతవరకు నివేదిక ఇవ్వలేదని పేర్కొన్నారు. మొత్తానికి కమిషనర్ వ్యవహారశైలి వల్ల రాష్ట్ర ఖజానాకు కోట్ల నష్టం వాటిల్లిందని మంత్రి లేఖలో వెల్లడించారు. 

55
ఆరు పేజీల లేఖ

ఎక్సైజ్ శాఖలో తన ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఇద్దరూ పాటించడం లేదని జూపల్లి కృష్ణారావు ఆరు పేజీల లేఖలో స్పష్టం చేశారు. ఈ పరిణామం తెలంగాణ ప్రభుత్వంలో, బ్యూరోక్రాట్లలో తీవ్ర చర్చకు దారితీసింది.

Read more Photos on
click me!

Recommended Stories