
Telangana Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ విడుదలయ్యాక... ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డాక వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో గ్రామాల్లో రాజకీయాల్లో ఒక్కసారిగా చల్లబడ్డాయి... అయితే తాజాగా తెలంగాణ కేబినెట్ నిర్ణయంతో విలేజ్ పాలిటిక్స్ లో హీట్ పెరిగే అవకాశాలున్నాయి. ఇంతకాలం సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి పదవికి అనర్హులుగా ఉన్నవారు తాజాగా అర్హులుగా మారారు. దీంతో సర్పంచ్ ఆశావహుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలున్నవారు పోటీచేసేందుకు అనర్హులుగా ఉండేవారు. దీంతో చాలామంది రాజకీయాలపై ఆసక్తి ఉన్నా ఎన్నికల్లో పోటీచేయలేని పరిస్థితి ఉండేది. ఇది గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు సిద్దమయ్యింది... ఈమేరకు ఇవాళ (అక్టోబర్ 23, గురువారం) జరిగిన కేబినెట్ భేటీలో ఇందుకు ఆమోదం తెలిపింది.
తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం 2018 లో సెక్షన్ 21(3) ప్రకారం ఇద్దరికంటే ఎక్కువమంది పిల్లలుండేవారు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఇప్పుడు ఈ సెక్షన్ ను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఓ ఆర్డినెన్స్ తీసుకురావాలని భావిస్తోంది ప్రభత్వం.
గత మంత్రివర్గ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైల్ ను సిద్దం చేయాలని పంచాయితీరాజ్ శాఖను ఆదేశించారు. ఈ ఫైల్ ను వెంటనే సిద్దం చేయడమే కాదు మంత్రి సీతక్క సంతకం కూడా చేశారు.. తాజాగా కేబినెట్ ఆమోదం కూడా లభించింది… ఇక ఆర్డినెన్స్ వెలువడితే ఇద్దరు కంటే ఎక్కువమంది పిల్లలున్నవారు కూడా స్థానిక సంస్థల్లో పొటీకి అర్హులుగా మారతారు.
దేశంలో జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను అస్త్రంగా వాడుకున్నారు గత పాలకులు. 1994 లో ఇద్దరు పిల్లల నిబంధనను తీసుకువచ్చారు... ఎక్కువమంది పిల్లలుంటే గ్రామాల్లో జరిగే సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు అర్హత ఉండదన్నమాట. కుటుంబ నియంత్రణపై అవగాహన కోసం ఈ సరికొత్త ప్రయోగం చేశాయి గత ప్రభుత్వాలు.
ఈ నిబంధన 1994 నుండే అమల్లోకి తీసుకువచ్చారు కాాబట్టి అంతకుముందే ఎంతమంది పిల్లలు కలిగివున్నా స్థానిక సంస్థల ఎన్నికలకు అర్హులే. కేవలం 1994 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలుంటేనే అనర్హులు. ఈ నిబంధనవల్ల చాలామంది రాజకీయాలపై ఆసక్తివున్నా ఎన్నికల్లో పోటీచేయలేకపోయారు.
ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల కారణంగా ప్రభుత్వాలే ఇద్దరికంటే ఎక్కువమంది పిల్లల్ని కనాలని సూచిస్తున్నాయి. చాలాదేశాల్లో యువత శాతం తగ్గిపోతోంది... ఇలాంటి పరిస్థితి ఇండియాకు రాకూడదనే జనాభా నియంత్రణ విషయంలో పాలకులు వెనక్కి తగ్గుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలుగా ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించింది.
తెలంగాణ ఏర్పాటుతర్వాత ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు... 2018 లో తెలంగాణ పంచాయితీరాజ్ చట్టాన్ని సవరించినా ఈ ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించలేదు. దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలున్నవారు అనర్హులుగా కొనసాగారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపుపై రాజకీయ నాయకుల నుండి ఒత్తిడి మొదలయ్యింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం చివరకు తాజా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎంతమంది పిల్లలున్నా ఏ అడ్డంకి ఉండదు.. అభ్యంతరం లేకుండా పోటీచేయవచ్చు.
ఇటీవల తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో చాలామంది పోటీకి సిద్దమయ్యారు. ఎంపిటిసి, జడ్పిటిసి తో పాటు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి ఒక్కో గ్రామంలో పది ఇరవైమంది లీడర్లు ఆసక్తి చూపించారు. ప్రజలను ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలకు కూడా తెరతీశారు. కానీ అనూహ్యంగా రాష్ట్ర హైకోర్టు బిసి రిజర్వేషన్ల పెంపుకు అంగీకరించకపోవడంతో ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
అయితే తాజాగా ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపుతో ఈ ఎన్నికల్లో పోటీ మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు పిల్లల నిబంధన అడ్డుగా ఉండటంతో పోటీచేయలేకపోయినవారు సైతం ఇకపై పోటీకి సిద్దం కానున్నారు. దీంతో గ్రామ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.