మరోసారి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Published : Aug 23, 2025, 08:27 AM IST

Telangana, Andhra Pradesh Weather update: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు 

PREV
15
వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించిపోయింది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తరుణంలో మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

25
తెలంగాణకు రెయిన్ అలర్ట్..

తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు (30–40 కిమీ/గం) వీచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

35
హైదరాబాద్‌ వాతావరణ పరిస్థితి

హైదరాబాద్‌లో శనివారం రోజంతా మేఘావృత వాతావరణం నెలకొన్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాస్త ఎండగా ఉన్నా, మధ్యాహ్నం తర్వాత తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 33 డిగ్రీల సెల్సియస్‌గా, రాత్రి వేళ ఆ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. 

గత కొన్ని రోజులుగా నగరంలో వర్షాలు విరామం లేకుండా పడుతుండటం వల్ల పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో వచ్చే వారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.

45
ఏపీలో వాతావరణం ఇలా..

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో తీరప్రాంతాలు, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. తీరప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో వర్షాలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

55
జలకళ

గత రెండు వారాలుగా కురిసిన విపరీత వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. కుండపోత వర్షాల కారణంగా జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, కృష్ణ వంటి ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 

భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories