
“తెలంగాణ మీదుగా వెళ్లే గోదావరి నీరు ఈ ప్రాంతానికి అందడం లేదు.. తెలంగాణ వస్తేనే గోదావరి నీళ్లు మనకు దక్కుతాయి”. ఇదీ..తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పిన మాట. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ఈ దిశగా అడుగులు వేశారు.
ఇందులో భాగంగానే జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కన్నెపల్లి సమీపంలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టారు. తెలంగాణలో 13 జిల్లాల్లో 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నదే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
గోదావరి నీటిని ఎత్తిపోస్తూ తెలంగాణలో జిల్లాలకు సాగు, తాగు నీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే మల్టీ సెజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచింది. 2016లో ఈ ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2019 జూన్ 21న ఈ ప్రాజెక్టును కేసీఆర్ జాతికి అంకితం చేశారు. మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావడం విశేషం.
* కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు 80 వేల ఎకరాల భూమిని సేకరించారు.
* 1832 కిలోమీటర్ల మేర గోదావరి నీటి సరఫరా జరిగేలా ప్రణాళికలు రచించారు.
* ఇందులో భాగంగా 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ ద్వారా, 203 కిలోమీటర్ల సొరంగ మార్గంలో నీటిరి తరలించేలా నిర్మాణం చేపట్టారు.
* ప్రాజెక్టులో భాగంగా 20 లిఫ్ట్‌లు, 19 పంపు హౌజ్‌లు, 19 రిజర్వాయర్లను రూపొందించారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. 2023 అక్టోబర్‌లో ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడంతో వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల భద్రతపై విచారణ ప్రారంభించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పటి బీఆర్ఎస్ అవినీతి చేసిందని ఆరోపించిన కాంగ్రెస్ విచారణ మొదలు పెట్టింది. కాళేశ్వరం కమిషన్ విచారణ పేరుతో కమిటీని ఏర్పాటు చేశారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని ఈ కమిటీ ఇప్పటికే పలువురు అధికారులను విచారించగా. తాజాగా ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కీలక బాధ్యతల్లో ఉన్న హరీష్ రావు, ఈటల రాజేందర్‌ను విచారించగా తాజాగా కేసీఆర్‌ను విచారించింది.
మేడిగడ్డ బ్యారేజ్ లో నిర్మాణ లోపాలు ఉన్నాయి. గోదావరి ప్రవాహాన్ని ఎదుర్కొనలేని స్థాయిలో నిర్మాణం ఉండటం.
మునుపటి ప్రణాళికను మార్చడం వల్ల వ్యయం పెరిగిందని ఆరోపణ. అవసరం లేని మార్పులతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్న విమర్శలు వచ్చాయి. భారీగా ఖర్చు పెట్టినా, రైతులకు పూర్తిగా నీరు అందడం లేదు. అనేవి ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వాధికారి హోదాలో అక్రమ నిర్ణయాలు తీసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదవవచ్చు.
అవినీతి నిరూపితమైతే ఐపీసీ 409 (భారత శిక్షాసమితి – పబ్లిక్ ట్రస్ట్ ఉల్లంఘన) కింద శిక్ష పడే అవకాశం ఉంది. కేసు తీవ్రత ఆధారంగా 7 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేవు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను ప్రతీకార చర్యగా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ తన అసమర్థ పాలన నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ పని చేస్తోందని అంటున్నారు. వేలాది ఎకరాలకు నీరు అందించేందుకు కృషి చేసిన కేసీఆర్ గౌరవాన్ని దెబ్బ తీసేందుకే ఇలాంటి చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.