Published : Jun 11, 2025, 08:27 AM ISTUpdated : Jun 11, 2025, 09:28 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం ఉంది. ఓవైపు భారీ వర్షాలు కురుస్తుంటే మరోవైపు నడివేసవిలో మాదిరిగా మండుటెండలు ఉన్నాయి. నేడు ఎక్కడ వర్షాలు, ఎక్కడ ఎండలుంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. తెలంగాణలో ఈ మూడ్రోజులు (జూన్ 11,12,13) వర్షాలు దంచికొడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు తిరిగి యాక్టివ్ గా మారడంతో పాటు ద్రోణుల ప్రభావంతో వర్షాలు మొదలై తెలంగాణలో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయని.. కొన్నిచోట్ల మాత్రం భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు.
26
ఈ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు
మహబూబ్ నగర్ జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక రాజధాని నగరం హైదరాబాద్ తో పాటు శివారుజిల్లాలు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, భువనగిరి కూడా చిరుజల్లులతో చల్లబడనున్నాయని ప్రకటించారు. ఇలా వర్షాలు కురిసే అవకాశాలున్న జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
36
తెలుగు ప్రజలు తస్మాత్ జాగ్రత్త
వర్షాలతో పాటు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణలో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాబట్టి వ్యవసాయ పనులు చేపట్టే రైతులు జాగ్రత్తగా ఉండాలని... వర్షం కురిసే సమయంలో చెట్లకింద ఉండకూడదని సూచిస్తున్నారు. ఇక రేపట్నుంచి (జూన్ 12) నుండి స్కూళ్లు ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహాలు, జలాశయాల సమీపంలో నివాసముండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ వర్షాలకు బలమైన ఈదురుగాలులు తోడవుతాయని... గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కాబట్టి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. వర్షాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో పురాతన, శిథిలావస్థలోని భవనాలు, నిర్మాణాలు కూలే ప్రమాదం ఉంటుంది... అలాంటివాటిలో నివాసముండేవారు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు.
56
ఏపీలో భారీ వర్షాలు
ఇక నేడు వర్షాల విషయానికి వస్తే ప్రకాశం, కర్నూల్, నంద్యాల, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలకు అలర్ట్ జారీచేసారు.
66
ఈ ఏపీ జిల్లాల్లో మండుటెండలు
మరోవైపు ఏపీలోని కొన్ని జిల్లాల్లో జూన్ 11న ఎండలు మండిపోతాయని, ఉక్కపోత సతమతం చేస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అత్యధికంగా 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతాయట. ఇలా రాష్ట్రంలో ఓవైపు వానలు, మరోవైపు ఎండలతో విచిత్ర వాతావరణం ఉంటుంది.