అడుగు బ‌య‌ట‌పెట్టేముందు ఆలోచించుకోండి.. ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు. ఎల్లో అల‌ర్ట్ జారీ

Published : Jul 23, 2026, 09:58 AM IST

IMD Rain Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, చురుగ్గా కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. ఈ ప్రభావంతో గురువారం కూడా వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు.

PREV
15
తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో అధిక వర్షపాతం

సోమవారం ప్రారంభమైన వర్షాలు మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను తడిపేశాయి. రంగారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, నల్గొండ, నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగాంలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా జైనద్, భారంపూర్ ప్రాంతాల్లో 4.6 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా కోల్వాయి 4.4, భోరాజ్ 4.3, మంచిర్యాల జిల్లా తపాల్‌పూర్ 4.1, ఆదిలాబాద్ రామ్‌నగర్ 4.1, తాంసి ప్రాంతంలో 4 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం కూడా వర్షాల ప్రభావం కొనసాగింది. వికారాబాద్ జిల్లా పెద్దుమంతల్, కొడంగల్ ప్రాంతాల్లో 2.5 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ రామ్‌నగర్ 2.4, నిజామాబాద్ కల్దుర్కి 2.4, రంగారెడ్డి ప్రొద్దుటూరు 2.3, మహబూబ్‌నగర్ మిడ్జిల్ 2.2, నిర్మల్ పాక్‌పాట్లలో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

25
హైద‌రాబాద్‌లో విస్తారంగా వ‌ర్షం

హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం గంటపాటు మోస్తరు వర్షం కురవడంతో రహదారులు నీటితో నిండాయి. గచ్చిబౌలిలో అత్యధికంగా 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రహ్మత్‌నగర్‌లో 1.6 సెంటీమీటర్లు, బోరబండలో 1.5, మైత్రివనం, మాదాపూర్‌లో చెరో 1.4, శ్రీనగర్ కాలనీ, మూసాపేట, జింఖానా ప్రాంతాల్లో 1.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, హైదరాబాద్‌లో రానున్న రోజుల్లో కూడా మేఘావృత వాతావరణం కొనసాగడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది.

35
9 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఉరుములు, పిడుగులతో జాగ్రత్త

గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 28 వరకు జల్లులు, ఈదురుగాలులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.

45
లోటు వర్షపాతం తగ్గుముఖం.. ఇంకా కొన్ని జిల్లాల్లో ఆందోళన

ఇటీవలి వర్షాలతో తెలంగాణలో వర్షపాత లోటు కొంత మేర తగ్గింది. కొన్ని రోజుల క్రితం 34 శాతంగా ఉన్న లోటు ప్రస్తుతం 24 శాతానికి చేరింది. సాధారణంగా ఈ సమయానికి నమోదుకావాల్సిన 288 మిల్లీమీటర్లకు బదులుగా ఇప్పటివరకు 218 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటికీ అత్యధికంగా 57 శాతం లోటు ఉంది. హనుమకొండలో 54 శాతం, వరంగల్‌లో 49 శాతం, యాదాద్రి భువనగిరిలో 46 శాతం, జనగామలో 45 శాతం లోటు నమోదైంది. మహబూబాబాద్, ఖమ్మం, నారాయణపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, వనపర్తి, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వికారాబాద్ జిల్లాల్లో 30 నుంచి 35 శాతం వరకు లోటు కొనసాగుతోంది. అయితే నల్గొండ జిల్లాలో మాత్రం సాధారణం కంటే 2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అధికారుల అంచనా ప్రకారం మరో వారం రోజుల పాటు ఇదే తరహాలో వర్షాలు కొనసాగితే రాష్ట్రంలో వర్షపాత లోటు మరింత తగ్గే అవకాశం ఉంది.

55
ఏపీలోనూ భారీ వర్షాల సూచన..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా పార్వతీపురం మన్యం, పోలవరం పరిసరాలు, తూర్పు గోదావరి, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని అధికారులు సూచించారు. రైతులు వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో వాతావరణ పరిస్థితులను గమనించాలని, తీరప్రాంత జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.

Read more Photos on
click me!

Recommended Stories