
హైదరాబాద్.. ప్రపంచ పటంలో ఐటీ హబ్‌గా, చారిత్రక నగరంగా వెలుగొందుతున్న మహానగరం. కానీ ప్రతి ఏటా వేసవి కాలం వస్తుందంటే చాలు, ఈ మహానగరం గొంతు ఎండుతుంది. పెరుగుతున్న జనాభా, అస్తవ్యస్తమైన పట్టణీకరణ, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల హైదరాబాద్ తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు 'సరస్సుల నగరం'గా పిలవబడిన ఈ ప్రాంతం, నేడు ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరం.
హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో వేసవిలో నీటి సమస్యలు ఉంటాయి. కానీ బడాబాబులు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ వంటి ప్రాంతాల్లో నీటి సమస్య మరీ ఎక్కువ. అందుకే ఈ ప్రాంతాల్లో ట్యాంకర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఫిబ్రవరిలోనే నీటి కొరత ప్రారంభం అయ్యింది... ఇక మార్చి, ఏప్రిల్, మే, జూన్ లలో ఇది తారాస్థాయికి చేరుతుంది. ఈ నాలుగు నెలలు ట్యాంకర్లకు ఫుల్ గిరాకి.
ప్రైవేట్ వ్యక్తులు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో బోర్లు వేసి నీటి దందా సాగిస్తున్నారు. ఇలా ఒక్క ట్యాంకర్ తో అక్రమంగా నీటితో వ్యాపారం చేస్తూ వేసవిలో రోజుకు రూ.10 నుండి రూ.20 వేల వరకు సంపాదిస్తున్నారు. ఇలా కొందరు పదుల సంఖ్యలో ట్యాంకర్లను కలిగివున్నారు. వాటర్ ట్యాంకుకు రూ.2 నుండి 4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒక్క ట్యాంకర్ రోజుకు నాలుగైదు వాటర్ ట్యాంకులు అమ్మినా చాలు.. నెలకు లక్షల ఆదాయం.
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల దందా ఇలా ఉంటే జలమండలి (HMWSSB) కి కూడా బుకింగ్స్ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజువారి వాటర్ ట్యాంకర్ బుకింగ్స్ భారీగానే ఉంటున్నాయి.. వచ్చేనెల ఏప్రిల్ లో డిమాండ్ మరింత పెరిగి ఏప్రిల్ లో రోజుకు 10,000 బుకింగ్స్ జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
జలమండల వాటర్ ట్యాంకర్ల ద్వారా స్వచ్చమైన నీటిని సరఫరా చేస్తాం.. కాబట్టి వీటినే వాడాలని జలమండలి అధికారులు నగరవాసులను సూచిస్తున్నారు. ఈ వాటర్ ట్యాంకర్స్ ను 155313 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయడం లేదా అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని చెబుతున్నారు. జలమండలి మొబైల్ యాప్ ద్వారా ట్యాంకర్ బుక్ చేసుకోవచ్చు.
హైదరాబాద్ నీటి సమస్యకు ప్రధాన కారణం భూగర్భ జల మట్టాలు పడిపోవడం. నగరంలోని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురై కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు, కృష్ణా, గోదావరి నదుల నుండి నీటిని తరలించే ప్రక్రియలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు, పైపులైన్ల లీకేజీలు సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరగడంతో విపరీతంగా బోర్లు వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గడం లేదా అకాల వర్షాలు కురవడం కూడా రిజర్వాయర్లలో నీటి నిల్వపై ప్రభావం చూపుతోంది.
ఈ నీటి కొరత కేవలం దాహానికే పరిమితం కాకుండా సామాజిక జీవనంపై కూడా ప్రభావం చూపుతోంది. మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు నీటి ట్యాంకర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సమయానికి నీరు అందక గృహిణులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ సంస్థలు, ఇతర పరిశ్రమలు కూడా నీటి నిర్వహణ కోసం భారీగా వెచ్చిస్తున్నాయి. నీటి కోసం గల్లీల్లో జరిగే గొడవలు సామాజిక అశాంతికి దారితీస్తున్నాయి. ఇది పరోక్షంగా నగర ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
గత ప్రభుత్వం 'మిషన్ భగీరథ' వంటి పథకాల ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించే ప్రయత్నం చేసింది... అయినా పెరుగుతున్న అవసరాలకు అది సరిపోవడం లేదు. నగరంలోని పురాతన చెరువులను పునరుద్ధరించడం, మూసీ నదిని శుద్ధి చేయడం వంటి చర్యలు వేగవంతం కావాలి. కేవలం ప్రభుత్వమే కాకుండా, పౌరులలో కూడా బాధ్యత పెరగాలి. ప్రతి ఇంట్లో 'వర్షపు నీటి ఇంకుడు గుంతలు' (Rainwater Harvesting) ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసుకోవాలి. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవడం ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలి.
నీరు ప్రాణాధారం. రాబోయే తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి స్వచ్ఛమైన నీరు, పర్యావరణం. హైదరాబాద్‌ను నీటి కష్టాల నుండి గట్టెక్కించాలంటే శాస్త్రీయమైన నీటి యాజమాన్య పద్ధతులు అవసరం. రీసైక్లింగ్ చేసిన నీటిని ఉద్యానవనాలకు, పరిశ్రమలకు వాడటం ద్వారా తాగునీటిపై ఒత్తిడి తగ్గించవచ్చు. పాలకుల చిత్తశుద్ధి, ప్రజల సహకారం తోడైతేనే 'విశ్వనగరం'గా ఎదిగే క్రమంలో హైదరాబాద్ తన దాహాన్ని తీర్చుకోగలదు. మన చేతుల్లో ఉన్న నీటి చుక్కను కాపాడుకుంటేనే, రేపటి తరం సురక్షితంగా ఉంటుంది.