
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న నేషనల్ హైవే–65 (NH-65)ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 269 కిలోమీటర్ల రహదారిలో 229 కిలోమీటర్ల మేర విస్తరణ జరగనుంది. ఈ మేరకు కేంద్ర రహదారి, రవాణా శాఖ భూసేకరణ ప్రక్రియను ప్రారంభిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని ప్రధాన రహదారులు ఆధునికంగా మారనున్నాయి. విస్తరణ పనులకు అవసరమైన 182.41 హెక్టార్ల భూమి సేకరణను ప్రారంభించారు. కేంద్రం ఈ ప్రాజెక్టుపై రూ.10,391 కోట్ల భారీ వ్యయాన్ని అంచనా వేసింది.
కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 9 మండలాల పరిధిలో భూసేకరణ జరుగుతుంది. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, కేతేపల్లి, చివ్వెంల, కోదాడ, మునగాల మండలాల్లోని సుమారు 40 గ్రామాలను ఈ విస్తరణలో చేర్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పరిధిలో నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, వెస్ట్, నార్త్ మండలాల్లోని గ్రామాల భూములను సేకరించనున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆయా ప్రాంతాల ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లను నియమించారు.
డీపీఆర్ (Detailed Project Report) ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 231.32 కిలోమీటర్ల మేర విస్తరణ జరగనుంది. ఇందులో 209.07 కి.మీ. బ్రౌన్‌ఫీల్డ్, 22.25 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ మార్గం ఉంటుంది. ఏపీలో అంబారుపేట–ఐతవరం మధ్య 7.3 కి.మీ. బైపాస్ రోడ్డు, కాచవరం–పల్లిపాడు పరిధిలో 16.15 కి.మీ. బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. మొత్తం 4 ఫ్లైఓవర్లు, 60 అండర్‌పాస్‌లు, 10 జంతువుల అండర్‌పాస్‌లు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయి. హైవేను హై సెక్యూరిటీ స్మార్ట్ రోడ్డుగా తీర్చిదిద్దుతూ అత్యాధునిక కెమెరాలు, రహదారి సెన్సార్‌లు, డిజిటల్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నారు.
ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు స్థానిక వాహనాలు కూడా హైవేపైకి రావడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 17 ప్రమాద ప్రాంతాలను (బ్లాక్‌స్పాట్స్) గుర్తించి, రూ.325 కోట్లతో అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. చౌటుప్పల్, చిట్యాల, కోదాడ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్‌లను తగ్గిస్తూ, లేన్ల విస్తరణ ద్వారా ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదనంగా ఎల్‌బీనగర్–హయత్‌నగర్ మధ్య 8 వరుసలతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనను కూడా సిద్ధం చేశారు.
ఈ విస్తరణ పూర్తి అయితే హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ప్రస్తుతం సగటున 5 గంటలు పట్టే ప్రయాణం, కొత్త 6 లేన్ల రహదారి పూర్తయిన తర్వాత సుమారు మూడున్నర నుంచి 4 గంటలలోపు పూర్తి కావచ్చని అంచనా. ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు తగ్గడంతో వాహనాల వేగం పెరిగి, సమయం దాదాపు 2 గంటలు ఆదా కానుంది.
డీపీఆర్ నివేదికను ఈ నెల రెండో వారంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టెక్నికల్ కమిటీ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఆమోదం లభించిన వెంటనే ప్రాజెక్టును పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌లో అమలు చేస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తయితే 2026–27 ఆర్థిక సంవత్సరంలో విస్తరణ పనులు ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి తెలంగాణ–ఏపీల మధ్య ప్రయాణ సౌకర్యాలు మరింత వేగవంతం అవుతాయి. హైదరాబాద్–విజయవాడ మార్గం దక్షిణ భారతదేశంలో అత్యంత సురక్షితమైన, స్మార్ట్ నేషనల్ హైవేగా మారనుంది.