Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న జనాభాతో పాటు కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచే దిశగా చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
ఔటర్ సమీప ప్రాంతాల్లో నివాసాలు పెరగడంతో బస్సుల అవసరం ఎక్కువైంది. అయితే లాభాలు వచ్చే మార్గాలకు మాత్రమే ఆర్టీసీ అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు ఇప్పటికే విస్తృత అధ్యయనం పూర్తి చేశారు.
25
శంషాబాద్–గచ్చిబౌలి మార్గంలో
ప్రస్తుతం శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు 315 నంబర్ బస్సు నడుస్తోంది. ఐటీ ఉద్యోగులు, చిన్న దుకాణదారులు, స్థానిక ప్రజల నుంచి ఈ రూట్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదే విధంగా ఇతర మార్గాల్లో కూడా బస్సులు నడిపితే ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
35
25 ఎగ్జిట్ పాయింట్లకు బస్సు అనుసంధానం
158 కిలోమీటర్ల పొడవున్న ఓఆర్ఆర్ పై 25 ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. నానక్‌రామ్ గూడ నుంచి పెద్ద అంబర్‌పేట, శామీర్‌పేట నుంచి దుండిగల్ వరకు ఈ పాయింట్లు విస్తరించి ఉన్నాయి. ప్రతి ఎగ్జిట్ నుంచి 20–25 కిలోమీటర్ల దూరంలో పెద్ద సంఖ్యలో కాలనీలు ఉన్నందున బస్సులు అనుసంధానం చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రైవేట్ వాహనాలు తగ్గితే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఓఆర్ఆర్ సేవలపై బస్సులు నడిస్తే పరిసర ప్రాంతాలకు 20–30 నిమిషాల్లో చేరవచ్చని అధికారులు చెబుతున్నారు. బస్సుల సంఖ్య పెరిగితే ఆధ్యాత్మిక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
55
మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 2800 బస్సులు నడుస్తున్నాయి. వాటిలో 450 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. త్వరలో కొత్త ఈ-బస్సులను కూడా ప్రవేశపెట్టడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ బస్సులను ఓఆర్ఆర్ ప్రాంతాల్లో నడపాలని స్థానికులు బలంగా కోరుతున్నారు. అధికారులు ఈ ప్రతిపాదనపై త్వరలో నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.